గ్రహణాలు రావడం కొత్త కాదు. కానీ ఒకేసారి మూడు గ్రహణాలు ఏర్పడడం మాత్రం అరుదైన ఖగోళ సంఘటన. ఎన్నో సంవత్సరాలకు కాని జరగని ఈ అరుదైన దృగంశం 2009లో జరగబోతోంది. ఈ గ్రహణాలపై జ్యోతిష్యులు, ఖగోళ శాస్తజ్ఞ్రులు భిన్నంగా ఆలోచిస్తున్నారు.
మూడు గ్రహణాలు ఒకేసారి ఏర్పడడం వినాశనానికి దారితీయవచ్చని జ్యోతిష్యులు అంటుండగా, ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించడం గొప్ప అదృష్టమని ఖగోళ శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. నెహ్రూ వేధశాల (ప్లానెటోరియం) అధికారులు కూడా ఈ వింతను చూసే అవకాశం రావడం అదృష్టమనే చెబుతున్నారు.
‘ఇది ప్రకృతి సహజంగా ఏర్పడేది. ‘విల్ ది హిస్టరీ రిపీట్ ఇట్ సెల్ఫ్ ట్రిపుల్ ఎక్లిప్స్ 2009’ అనే పుస్తకాన్ని రాసిన జ్యోతిషవేత్త డాక్టర్ డికె హరి మాత్రం- మూడు గ్రహణాలు వరసగా వచ్చిన పూర్వకాలంలో సందర్భాలను ఉదహరిస్తూ అవి వినాశనానికి కారణమైనట్లు తెలిపారు.
‘మహాభారతాన్ని బట్టి చూస్తే ఇలా జరగడం వినాశనానికి దారితీసిందని తెలుస్తోంది. క్రీస్తుపూర్వం 3067లో శ్రీకృష్ణుడు మొదటిసారిగా మూడు గ్రహణాల గురించి పేర్కొన్నాడు. అది సంభవించిన నెల లోగానే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత మరో 36 ఏళ్లకు జరిగిన ఇలాంటి సంఘటనే ద్వారక వినాశనానికి దారితీసింది’ అని డాక్టర్ హరి పేర్కొన్నారు. ![]()
ఇప్పుడు వరసగా వస్తున్న మూడు గ్రహణాలను గమనిస్తే ఈ నెల (జూలై 7న) చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ నెల 22న ఏర్పడే సూర్యగ్రహణం ఈ శతాబ్దంలోనే చాలా సేపు ఉండే సంపూర్ణ సూర్యగ్రహణం కావచ్చని అనుకుంటున్నారు. ఆ తర్వాత ఆగస్టు 6న మళ్లీ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
దేశంలో చాలాప్రాంతాలకు సూర్య గ్రహణం పడుతుందనీ, గ్రహణంలో చాలావరకు మూసుకుపోయి ఉండే సూర్యుడిని చూడవచ్చని అంటున్నారు. అయితే ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సూర్యగ్రహణం పాక్షికంగానే ఉంటుందని అంటున్నారు.
అయితే శాస్త్రజ్ఞులు కూడా గ్రహణాలకు సంబంధించి ఇంతే స్పష్టమైన ప్రతిపాదనలు చేస్తున్నారు. వీరి అభిప్రాయం ప్రకారం...
సూర్యగ్రహణ సమయంలో ప్రత్యేకంగా హాని చేసే కిరణాలు ఏవి సూర్యుడి నుండి వెలువడవు.
గ్రహణం అంటే భూమి, సూర్యుడు, చంద్రుల మధ్య జరిగే దాగుడుమూతలాటలో వచ్చే నీడల కదలిక తప్ప మరొకటి కాదు.
గ్రహణ సమయంలో అదనపు భౌతిక చర్యలేవి సూర్యునిలో జరగవు. కావున ప్రత్యేక కిరణాలు ఏమి వెలువడవు.
అందుకనే జనం నమ్ముతున్నట్లుగా, జ్యోతిష్కులు ప్రచారం చేస్తున్నట్లుగా గ్రహణ సమయంలో హాని జరగదని శాస్త్రజ్ఞులు నొక్కి చెబుతున్నారు. ఈ వాదన ప్రకారం...
గ్రహణం సమయంలో ఆహారపదార్ధాలు కాని, నీళ్ళుకాని ఏవిధంగా చెడిపోవు.
వాటిని తీసుకోవడం వలన నష్టం ఏమి ఉండదు. మాములుగా ఎప్పటిలా తినవచ్చు, తాగవచ్చు.
గర్భిణీలకు ఏవిధమైన హానిచేయదు. గర్భంలో ఉండే శిశువులకు కూడా ఏ విధమైన హాని కలుగదు.
నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో, గ్రహణం మొర్రికి గ్రహాణానికి కూడా సంబంధం ఉండదు.
శాస్త్రజ్ఞులలో కూడా గ్రహణాలను నమ్మేవారు, నమ్మనివారు ఆస్తికులు, నాస్తికులు ఉన్నారనుకోండి. ఆస్తికులే ఎక్కువగా ఉండవచ్చు కూడా. ఎందుకంటే హేతుబద్దమైన ప్రతిపాదనలకంటే ఊహలమీదే ప్రపంచం ఆధారపడుతున్న పరిస్థితి ఇప్పటికీ ప్రపంచంలో కొనసాగుతోంది.
సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని ప్రాచీన తత్వవేత్తలు భావించిన ఊహను తొలుత ఆర్యభట్ట (క్రీ.శ 6వ శతాబ్ది) తర్వాత కోపర్నికస్ (16వ శతాబ్ది) బద్దలు గొట్టి భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతోందని చెప్పిన వందల సంవత్సరాల తర్వాత గానీ మానవ సమాజం విస్తృత ప్రాతిపదికన ఈ నిరూపిత సత్యాన్ని లెక్కలోకి తీసుకోలేదు.
ఈరోజు కూడా మనిషికి తన విశ్వాసాలను అట్టి పెట్టుకునే హక్కు ఉంది. కానీ సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని ఎవరైనా అమాయకంగా అయినా సరే ఈరోజుల్లో చెప్పినట్లయితే ఇలాంటివారి మెదళ్లను మ్యూజియంలలో భద్రపర్చవలసిందే.
చంద్రలోకం, సురలోకం, పాతాళలోకం అంటూ ఉన్నాయని మనం నమ్మవచ్చు, మన ప్రాచీన విశ్వాసాలను ఉంచుకోవచ్చు. కాని చంద్రుడిపై పొడి మట్టి, శిలలు తప్ప ఇంకేమీ లేవని గాలీ, నీరు కూడా లేవని 40 ఏళ్ల క్రితమే మనిషి చంద్రయాత్ర ద్వారా కనుగొని ప్రకటించిన తర్వాత కూడా మనం వీటిని నమ్మడం అంటే కనీస హేతువుకు కూడా మనం దూరమైనట్లే లెక్క.
ఇలాంటి భౌతిక సత్యాలలో శాస్త్ర విజ్ఞానం అవలీలగా విజయాలు సాధించింది. కానీ శాస్త్రం కంటే భౌతిక వాస్తవాల కంటే ఊహలకు, భావోద్వేగ కల్పనలకు ఎక్కువ విలువ ఇస్తున్న ప్రపంచంలో గ్రహణం ఒక మొర్రి అయింది. గ్రహణాలపై విశ్వాసం కూడా ఓ వేలం వెర్రి అయ్యింది. అది చాలామందికి భక్తి పేరిట భుక్తిమార్గం కూడా అయింది.
వరుస గ్రహణాలు ప్రళయానికి సంకేతాలు కావు. ఉత్పాతాలకు చిహ్నాలు కావు. అంతరిక్ష చలనంలో జరిగే యాదృచ్ఛిక అమరికలకు విశ్వాసాలను ఆపాదించడం హేతు విరుద్ధం. శాస్త్ర విరుద్ధం, వాస్తవ విరుద్ధం కూడా.
ఇది మనిషి ప్రాపంచిక దృక్పధానికి సంబంధించిన విషయం. ఎవరు ఏ దృక్పధాన్ని ఆమోదిస్తున్నారు అనేదాన్ని బట్టే గ్రహణం మొర్రిలను మనుషులు నమ్ముతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.
లోడ్ అవుతోంది...