తారెగ్నా.. కేవలం 683 మంది జనాభా (స్త్రీలు 363, పురుషులు 320)కలిగిన ఊరు. బీహార్‌లోని పాట్నాలో ఉన్న ఓ సాధారణ గ్రామం. సంపూర్ణ సూర్యగ్రహణం ఘటన జరిగిన ప్రతి సందర్భంలోనూ ఈ చిన్ని గ్రామం అంతర్జాతీయ ప్రచారానికి నోచుకుంటోంది. కారణం.. ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టకు ఈ గ్రామంతో ఉన్న సంబంధమే.![]()
క్రీ.శ 6వ శతాబ్ది (476-550)లో ఆర్యభట్ట ఈ గ్రామంలోనే వేధశాలను ఏర్పర్చాడు. నక్షత్రాల గమనాన్ని పరిశీలించడంలో జీవిత పర్యంతం కృషి చేసిన ఆర్యభట్ట ఇప్పుడు యావత్ ప్రపంచమూ విశ్వసిస్తున్న సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చరిత్రలో మొదటిసారిగా ప్రతిపాదించినట్లుగా భావిస్తున్నారు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని అంతవరకూ ప్రపంచం నమ్ముతూ వచ్చిన భూకేంద్రక సిద్ధాంతాన్ని ఆర్యభట్ట తోసిపుచ్చి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందని ప్రకటించాడు.
వేల సంవత్సరాల క్రితం ప్రముఖ భారత అంతరిక్ష శాస్తవ్రేత్త ఆర్యభట్ట నక్షత్ర గమనా లను, గ్రహస్థితులను అధ్యయనం చేసిన తారెగ్నా గ్రామం చాలా ఏళ్ల అనంతరం అంతరిక్ష యాత్రికులతో సందడిగా మారింది. నేడు ఏర్పడబోయే సుదీర్ఘ సంపూర్ణ సూర్య గ్రమణాన్ని వీక్షించేందుకు ఇప్పటికే దేశం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గ్రామాన్ని చేరుకున్నారు. ![]()
వందలాది శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, అంతరిక్ష పర్యాటకులు సంపూర్ణ సూర్యగ్రహణం తిలకించేందుకోసం ప్రపంచం నలుమూలలనుంచి తారెగ్నాకు తరలి వచ్చారు. నాసా శాస్త్రజ్ఞులతో పాటు, బ్రిటన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల శాస్త్రజ్ఞులు, టిఐఎఫ్ఆర్, సిఎస్ఐఆర్ వంటి భారతీయ శాస్త్ర పరిశోధనా సంస్థల ప్రతినిధులు తారెగ్నాకు వచ్చారు.
క్రీస్తు శకం 6వ శతాబ్దిలో ప్రపంచ ప్రసిద్ధ భారతీయ ఖగోళ, గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట నక్షత్రాల గమనంపై పరిశోధనకు గాను ఎంచుకున్న రెండు స్థలాల్లో తారెగ్నా ఒకటి కావటంతో ఈ గ్రామం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
బీహార్ రాజధాని పాట్నాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామం ఖగోళ పరిశోధనలకు చక్కగాసరిపోతుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. సూర్య గ్రహణాన్ని వీక్షించడానికి తారెగ్న అనువైన స్థలమని నాసా శాస్తజ్ఞ్రులు పేర్కొన్నారు. ![]()
ఇక్కడి నుంచి ఖగోళంలో జరిగే వింతలను, వీక్షించడానికి, వాటపై పరిశోధనలు జరిపేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది ఇప్పటికే ఈ గ్రామం చేరుకున్నారు. ‘తారె- అనగా నక్షత్రాలు. గిననా- అంటే లెక్కించడం.’ నక్షత్రాలను లెక్కించడం. అందువల్లే ఈ గ్రామానికి ‘తారెగ్న’ అనే పేరువచ్చిందని స్థానికులు తెలిపారు.
సముద్ర మట్టానికి కేవలం 61 మీటర్ల ఎత్తున్న తారెగ్నా గ్రామానికి ఉన్నట్లుండి సందర్శకుల సందడి పెరిగింది. జూలై 22 బుధవారం ఏర్పడిన సూర్యగ్రహణ విశేషాలను గమనించడానికి వేలాదిమంది శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, ఔత్సాహికులు ఈ గ్రామానికి వెల్లువెత్తారు. సంప్యూర్య సూర్యగ్రహణాన్ని అత్యంత స్పష్టంగా దర్శించగల అతి కొ్ద్ది ప్రాంతాల్లో తారెగ్నా ఒకటని అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రకటించడంతో ఈ గ్రామం ఒక్కసారిగా పూర్వవైభవాన్ని సంతరించుకుంది. ![]()
అయితే అందరూ భావించినట్లుగా తారెగ్నాలో ఈసారి సూర్యగ్రహణం కనిపించలేదు. మేఘాలు గుమికూడడంతో ఎంతో ఆసక్తితో సూర్యగ్రహణాన్ని చూద్దామని వెల్లువలా వచ్చిన ప్రజలు, పరిశోధకులు హుతాశులయ్యారు. పసిఫిక్ మహాసముద్రంపై సూర్యగ్రహణం 6 నిమిషాల 38 సెకనులు కనిపిస్తుందని, తారెగ్నాలో కనీసం 3 నిమిషాల 38 సెకనులపాటు కనిపిస్తుందని పరిశీలకులు వేసుకున్న అంచనా గతి తప్పింది.
ఈ శతాబ్దిలోనే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడడానికి వచ్చిన వేలాది ప్రజలు మేఘాల అడ్డుతో ఆశాభంగం చెందినప్పటికీ సూర్యగ్రహణం సందర్భంగా తారెగ్నా ఒక్కసారిగా చీకటిలో మునిగిపోవటం చూసి హర్షధ్వానాలు చేశారు. గ్రామస్థులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ![]()
సూర్యగ్రహణం కనబడకపోయినప్పటికీ బుధవారం ఉదయం గం. 6.28ల నుంచి నాలుగు నిమిషాల వరకు తారెగ్నా గ్రామం చీకటిలో మునిగిపోయింది. నాసా నుంచి ఇద్దరు ప్రతినిధులు, ముంబై ఎన్జీవో సంస్థ స్పేస్ ప్రతినిధులు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు.
స్పేస్ ప్రతినిధి అమితాబ్ పాండే సూర్యగ్రహణాన్ని సందర్శించడానికి వచ్చిన వారు అడుగుతున్న ప్రశ్నలకు, సందేహాలకు జవాబులచ్చి ప్రజలను ఆకట్టుకున్నారు. సూర్యగ్రహణం సందర్భంగా తారెగ్నా చుట్టు పక్కల పొలాలు, రైల్వే లైన్లు, ఇళ్ల పైకప్పులమీద ఎక్కడ చూసినా జనంతో కిటకిటలాడిపోయాయి.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ, ఇతర మంత్రులు కూడా తారెగ్నాను సందర్శించారు. రెండతస్తుల ఆసుపత్రి పై కప్పుమీద నిలబడి సూర్యగ్రహణాన్ని గమనించిన నితీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రహణకాలలో చీకటిని చీల్చుకుని కాంతి ప్రసరించినట్లే బీహార్ రాష్ట్రాన్ని ఆవరించి ఉన్న అంథకారం త్వరలో అంతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాట్నాలో ఆర్యభట్ట పేరిట సాంకేతిక విద్యపై విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఉజ్వల చరిత్రకు సాక్షీభూతంగా నిలిచిన ఈ చిన్ని గ్రామంలోనే శతాబ్దాల క్రితం ఆర్యభట్ట వేధశాలను ఏర్పర్చి నక్షత్ర గమనాలను పరిశీలించారని గుర్తు చేశారు.
లోడ్ అవుతోంది...