Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

క్రికెట్ చరిత్రలో ఓ మహత్తర క్షణం




భారత క్రికెట్ చరిత్రలో అద్వితీయంగా మెరిసిన ఓ మహత్తర క్షణం ముగిసి పాతికేళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా 26 సంవత్సరాల క్రితం, జూన్ 25వ తేదీ రాత్రి 11 గంటలు దాటాక ప్రుడెన్షియల్ వరల్డ్ కప్‌‌ను గెలుచుకున్న "కపిల్ సేన" భారత క్రికెట్ చరిత్రను అమాంతంగా మలుపు తిప్పింది.

ఆనాటికి విశ్వవిజేతగా తేరిపార చూడనంత ఎత్తులో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యలా కనిపించిన వెస్టిండీస్‌ను 1983 సంవత్సరం జూన్ 25వ తేదీన ఖంగు తినిపించిన భారత జట్టు.. తొలిసారిగా క్రికెట్‌లో ప్రపంచకప్‌ను గెలుచుకుని జూన్ 25ను సువర్ణాక్షరాలతో లిఖించింది. "హర్యానా హరికేన్" అని అందరూ ముద్దుగా పిలుచుకునే "కపిల్ దేవ్" ఆనాటి టీం ఇండియాకు సారధ్యం వహించి విజయంవైపు నడిపించాడు.



మూడవ క్రికెట్ ప్రపంచ కప్‌గా పేరొందిన ప్రుడెన్షియల్ కప్‌ను ఇంగ్లండ్‌లో 1983 జూన్ 9 నుంచి జూన్ 25 దాకా నిర్వహించారు. నాటి క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పరుస్తూ టైటిల్‌ను భారత్ జగజ్జేత విండీస్ నుంచి ఎగరేసుకుపోయింది. ఈ టోర్నీలో మొత్తం 8 దేశాలు పాల్గొన్నాయి. రెండు గ్రూపులుగా సాగిన ప్రిలిమినరీ మ్యాచ్‌లో ఒక్కో గ్రూపులో నాలుగు టీములు తలపడ్డాయి.

ప్రతి జట్టు తన గ్రూపుకు అవతలి గ్రూపులోని జట్లతో రెండు సార్లు ఆడింది. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు (ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, భారత్) సెమీ పైనల్‌కు అర్హత సాధించాయి. ఇంగ్లండ్‌పై గెలిచిన భారత్, పాకిస్తాన్‌పై గెలిచిన వెస్టిండీస్ ఫైనల్లో అడుగుపెట్టాయి.



"క్రికెట్ మక్కా"గా పేరుగాంచిన ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రుడెన్షియల్ వరల్డ్ కప్‌గా ఫైనల్ మ్యాచ్‌లో.. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ప్రత్యర్థి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 54.4 ఓవర్లలోనే 183 పరుగులకు ఆలౌట్ అయింది. మహీందర్ అమర్‌నాథ్ (80 బంతుల్లో 26 పరుగులు) క్రిష్ణమాచారి శ్రీకాంత్ (57 బంతుల్లో 38 పరుగులు) సందీప్ పాటిల్ (29 బంతుల్లో 27) మదన్ లాల్ (27 బంతుల్లో 17) సాధించి కాస్త నయమనిపించారు.

మరోవైపున విండీస్ మేటి బౌలర్ చతుష్టయం ఆండీ రాబర్ట్స్, మార్షల్, జోయెల్ గార్నర్, మైఖేల్ హోల్డింగ్ అరివీర భయంకర ఫాస్ట్ బౌలింగ్‌తో భారత్ బ్యాటింగ్‌ను తుత్తునియలు గావించారు. అయితే భారత జట్టులోని టెయిలెండర్లు ఆశ్చర్యకరంగా ప్రతిఘటించడంతో భారత్ 183 పరుగులు చేయగలిగింది. భారత్ ఇన్నింగ్స్‌లో కేవలం మూడు సిక్స్‌లు మాత్రమే నమోదయ్యాయి. శ్రీకాంత్, సందీప్, మదన్‌లాల్ త్రయం సిక్సర్లు సాధించారు.

ఆ తర్వాత భారత్‌పై విజయం నల్లేరుమీద నడకలాంటిదన్న ధీమాతో, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆటగాళ్లను భారత బౌలర్లు మట్టి కరిపించి 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ చేసి చిరస్మరణీయమైన విజయాన్ని భారత్‌కి అందించారు.



ఆనాడు ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన టీమ్‌గా పేరు పొందిన వెస్టిండీస్ ముందు భారత్‌ను పిల్లికూన లాగే భావించారు. ఇక వివియన్ రిచ్చర్డ్స్ ఒంటి చేత్తో విండీస్ జట్టును గెలుపించడమే తరువాయి అని అందరూ భావించిన క్షణాల్లో చరిత్రలో అరుదుగా సంభవించే ఘటనలు వెంటవెంటనే జరిగిపోయాయి.

క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానంలో వాతావరణం, పిచ్ స్వభావాన్ని చక్కగా వినియోగించుకున్న భారత బౌలర్లు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న విండీస్ జట్టును 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ చేసి 43 పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయం సాధించిపెట్టారు.

అవి క్రికెట్ చరిత్రగతినే మలుపులు తప్పిన అద్వితీయ క్షణాలు. జగజ్జేత, కొరకరాని కొయ్య, ఓటమెరుగని జట్టుగా దశాబ్దం పాటు మెరిసిన వెస్టిండీస్ జట్టు అవమానకరమైన రీతిలో ట్రోఫీని కోల్పోయింది. ఆ క్షణం నుంచి నేటివరకు విండీస్ జట్టు కోలుకోలేదంటే భారత్ తీసిన దెబ్బ ఎంత బలంగా తగిలిందో అర్థమవుతుంది.

ప్రపంచ కప్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ఈ పైనల్ పోటీలో మహీందర్ అమర్‌నాథ్, మదన్‌లాల్ చెరొక 3 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత క్రికెట్ ప్రేమికులు జన్మాంతంలో కూడా మర్చిపోలేని ఘటన జరిగింది. క్రీజులో ఉన్నంతవరకు సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ విండీస్‌కు విజయం తథ్యం అనిపించేలా ఆడిన విండీస్ దిగ్గజం వివియన్ రిచ్చర్డ్స్ ఇచ్చిన క్యాచ్‌ను భారత్ కెప్టెన్ కపిల్ దేవ్ అమాంతంగా ఒడిసిపట్టుకున్నాడు.



ప్రపంచ కప్‌నే భారత్ చేతిలో పెట్టిన ఆ మేటి క్యాచ్‌ను అనితరసాధ్యమైన రీతిలో కపిల్ దాదాపు 20 గజాల దూరం పరుగెత్తి మరీ ఒడిసి పట్టుకున్నాడు. అప్పటికి రిచ్చర్డ్స్ 28 బంతుల్లో 33 పరుగులు చేసి కాకమీదున్నాడు. మరోవైపు విండీస్ టెయిలెండర్లను పడగొట్టే క్రమంలో అమరనాథ్ పొదుపుగా బౌల్ చేసి 7 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో విండీస్ తేరుకోలేపోయింది.

ప్రపంచ కప్‌లో అత్యంత పొదుపు బౌలర్‌గా నిలిచిన అమరనాథ్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 1983 ప్రపంచ కప్‌లో మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డు ప్రకటించలేదు. ప్రకటించి ఉంటే అది భారత్ కెప్టెన్ కపిల్ దేవ్‌కే దక్కేది. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసే కపిల్ 1983 ప్రపంచ కప్ పోటీలలో జింబాబ్వేపై జరిగిన వన్డే పోటీలో అనితర సాధ్యమైన అద్వితీయ మైన ఫీట్ సాధించాడు.

నిర్ణాయకమైన పోటీలో జింబాబ్వే చేతిలో 35 పరుగులకే అయిదు పరుగులు చేసి ఘోర ఓటమి అంచుల్లోకి వెళ్లిన బారత్ జట్టును కపిల్ ఆపద్బాంధవుడిగా ఆదుకున్నాడు. జట్టు స్ట్రయికింగ్‌ను మొత్తంగా తానే తీసుకుని విజృంభించిన ఆట పూర్తయ్యేసరికి కపిల్ 175 పరుగులు సాధించి ఒంటిచేత్తో విజయాన్ని సాధించిపెట్టాడు.



అయితే చివరిక్షణం వరకూ తాము ఆనాటి జగజ్జేత వెస్టిండీస్ జట్టుపై ఫైనల్లో గెలుస్తామని అసలు ఊహించలేదని చివరివరకూ పోరాడటమే పనిగా పెట్టుకున్నామని కపిల్ తర్వాత పలు సందర్భాల్లో కపిల్ చెబుతూ వచ్చాడు. దీన్ని బట్టి ఆ రోజు మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా కొనసాగిందో ఎవరయినా ఇట్టే ఊహించుకోవచ్చు.

అదృష్టవశాత్తూ జగజ్జేత విండీస్‌పై గెలిచిన భారత్ ప్రపంచ కప్‌ను ఎగరవేసుకుపోయిందని ఆనాడు విమర్శకులు భావించారు. కాని తదుపరి చరిత్రలో ఓటమి ఎరుగని జట్టుగా అద్వితీయ విజయాలు సాధించిన ఆసీస్‌ జట్టును 2001 నుంచి భారత్ చిత్తుగా ఓడించడం ద్వారా మరో గుణపాఠం నేర్పింది. కలకత్తా నుంచి పెర్త్ దాకా సాగిన ఈ విజయయాత్రలో భారత్ జట్టు అంటేనే క్రికెట్ ఆస్ట్రేలియా దడుచుకునేలా మారిపోయింది.

ఇదీ 1983 ప్రపంచకప్ భారత క్రికెట్‌కు అందించిన నజరానా... మనోబలం..

స్పందనలు

Re: క్రికెట్ చరిత్రలో ఓ మహత్తర క్షణం
తప్పులు ఉన్నాయి. జింబాబ్వే మీద మనం 5/17. మహీ0ద ర్ కాదు. మొహీ0ద ర్ .
Re: క్రికెట్ చరిత్రలో ఓ మహత్తర క్షణం
జింబాబ్వేపై టపా టపా రాలిన మన వికెట్ల వివరాలు పూర్తిగా తెలుసుకోకుండానే పాతికేళ్ల క్రితం ప్రపంచ కప్‌ కామెంటరీని రేడియోలో విన్న మెమరీ ఆధారంగా ఊహించి రాయడం జరిగింది. వెరిఫై చేసుకోవడానికి వీల్లేకపోయింది. లెక్క సరిచేసారు. ధన్యవాదాలు. కాని మహీందర్ కాదు మొహీందర్ అని రాస్తూ రెండు సార్లూ హీ పక్కన లెక్కల్లోని సున్న గుర్తు సంఖ్య పెట్టారు. తప్పేమో కదూ.... ధన్యవాదాలు
నిరాకరణ