ఇసుకమేటలతో సయ్యాటలాడి
యూఫ్రటిస్, టైగ్రిస్ మహానదుల మధ్య జలస్నానమాడి
ప్రసవించె మానవేతిహాసపు తొలి నాగరక శిశువు
మెసపుటోమియా పూదోటలో
ఘన మానవ చరితకు ముందు మాట రాసిన రాచబాటలో...
ఎన్నివేల సంవత్సరాల ఎడారి జీవన యానంలో
శ్రుతి తప్పని సంస్కృతీ గానంలో
గతి తప్పని వారసత్వ ప్రస్థానంలో
ఎన్నెన్ని మజిలీలు ఏమేమి నగిషీలు...
ఇలాంటి ఓ మహోజ్వల నాగరకత...
ఓ బొడ్డూడని నయా నయవంచక నాగరకత
ఓ దారితప్పిన నావికుడు కనుగొన్న నాగరకతా..
గాడి తప్పి నేడు చేసిన దాష్టీకంలో ...
ఆ వికటాట్టహాసపు పదఘట్టనల కింద
ఆ ఎడారి పూల సోయగం
చివరకు రాలిపోయె...
వాడి పోయి
ఓడిపోయి...
ప్రతిఫలించే దైన్యమే తప్ప
ప్రతిఘటించే ధైర్యమే కానరాని
నవ నాగరిక ఎడారిలో
పిరికితనపు ఒయాసిస్సు సాక్షిగా.....!!!!!!!
---దుర్గారావు
ఇరాక్ దురాక్రమణ సమయంలో అమెరికా ఆభిజాత్యానికి నిరసనగా మా మిత్రులు దుర్గారావు రాసిన కవిత ఇది. ఇప్పుడు సందర్భం కాకపోవచ్చు కాని పదునైన అభివ్యక్తికి సంకేతంలా నిలిచే ఈ వాడి కవితను పాఠకులకు పరిచయం చేయాలనిపించింది. అందుకే...
"ప్రతిఫలించే దైన్యమే తప్ప ప్రతిఘటించే ధైర్యమే కానరాని నవ నాగరిక ఎడారి"
గా ఇరాక్‌ను వర్ణిస్తూ కవి ఇక్కడ ముగించారు. అయితే నిర్ణయాత్మక స్థాయిలో కాకపోయినప్పటికీ ఇరాక్ జాతీయ వాదులు తమ గడ్డమీద ఈనాటికీ అమెరికా సేనలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. బుష్‌పై జైదీ బూటు సాక్షిగా ఇది నిజం...
ఈ కవితను ఈ కోణంలోనే అర్థం చేసుకుంటారని ఆశిస్తూ.....
లోడ్ అవుతోంది...