మహా ప్రస్థానం పీఠిక
జూన్ 15. మహాకవి శ్రీశ్రీ అస్తమయ దినం. ఈ సందర్భంగా శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటికి చలం రాసిన చారిత్రాత్మక యోగ్యతా పత్రాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నా. ముందుగా యోగ్యతాపత్రం పీఠిక ప్రాముఖ్యతను చూడండి.
యోగ్యతా పత్రం
![]()
శ్రీ శ్రీ వ్రాసిన మహాప్రస్థానం పుస్తకానికి 1940లో చలం రాసిన పీఠిక. తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికలలో ఇది ఒకటి. ఆ పుస్తకం ఎవరు చదవాలో, ఎందుకు చదవాలో, ఎలా చదవాలో వివరించే పీఠిక అది. రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల షడ్జధ్వానం విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి. అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని సమాయత్త పరచే పీఠిక అది.
మహాప్రస్థానంలోని రచనలకు దీటుగా ఈ ఉపోద్ఘాతం తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైంది. "యోగ్యతా పత్రం" అన్న శీర్షికతో వ్రాయబడిన ఈ ముందుమాట తెలుగు రచనలలో అత్యంత ప్రసిద్ధమైన ముందుమాటలలో ఒకటి. చలం మాటల్లో అంత శక్తి, వాడి(పదును) అలోచింపజేయగల శక్తి ఉన్నాయి. యోగ్యతాపత్రంలో చలం రాసిన కొన్ని వాక్యాలు మచ్చుకు ఇక్కడ చూడండి.
"..ఇది మహా ప్రస్థానం సంగతి కాదు. ఇదంతా చెలం గొడవ. ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి (దీంట్లో మీ సెక్సుని ఉద్రేకించే సంగతులు ఏమీ లేవు) శ్రీ శ్రీ అర్ణవంలో పడండి. పదండి ముందుకు. అగాథంలోంచి బైలుదేరే నల్లని అలలు మొహాన కొట్టి, ఉక్కిరిబిక్కిరై తుఫానుహోరు చెవుల గింగురుమని, నమ్మిన కాళ్ళకింది భూమి తొలుచుకు పోతోవుంటే, ఆ చెలమే నయమని వెనక్కి పరిగెత్త చూస్తారు.
శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్. ఆ రెంటికీ హద్దులూ, ఆజ్ఞలూ లేవు. అప్పుడప్పుడు లక్షణాలనూ, రాగాలనూ మీరి చెవి కిర్రుమనేట్టు ఇద్దరూ అరుస్తారు. ఏమీ రసం లేకుండా flat గా ఎక్కడికో, ఏమీ చేతగానివాళ్ళమల్లే జారిపోతారు.
కాని ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలిదెబ్బల కింద ఎగిరిపడే సముద్రపు తుఫాను గర్జనం, మర ఫిరంగుల మరణ ధ్వానం, గింగురు మంటాయి. కంఠం తగ్గించి వినపడకుండా తగ్గు స్థాయిలో మూలిగారా, దిక్కులేని దీనుల మూగవేదన, కాలి కింద నలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళు లేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం వినిపింప జేస్తారు.
బుద్ధి వున్నవాడెవ్వడూ అతనిది సంగీతమని కాని, ఇతనిది కవిత్వమని కాని వొప్పుకోడు; వొప్పుకోటమూ లేదు. ఎందుకంటే ఈ ఇద్దరి Appeal బుద్ధిని, వివేకాన్ని, కళాబంధనల్ని మించిన ఏ అంతరాళానికో తగులుతుంది -ఆ అంతరాళం అనేది వున్న వాళ్ళకి.
...శ్రీ శ్రీ "ఆకలేసి" నక్షత్రాలు అదిరిచూసే "కేకలేశాడు." ఈ కవికి ఆకలివేస్తే రా- గారి యింటికెళ్ళి శ్లాఘించి భత్యఖర్చు తెచ్చుకుని, భోజనం చేసి ప్రియురాలిమీద గీతం వ్రాశాడు."
తన కవిత్వానికి ముందు మాట వ్రాయమని శ్రీ శ్రీ అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నాడు చెలం. తూచవద్దు, అనుభవించి పలవరించమన్నాడు శ్రీ శ్రీ.
శ్రీశ్రీ నిర్వహించిన ప్రజ శీర్షికలో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు "యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను అంటాను, మీరేమంటారు." అతిశయోక్తి అయినా, అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది.
అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు 'మీరు సార్ధక నామధేయులంటాను.'
యోగ్యతాపత్రం
యోగ్యతాపత్రాన్ని మన మాటల్లో వ్రాయడం కన్నా చలం భాషలో వ్రాస్తేనే దానికి సార్థకత. అందుకే చలం వ్రాసిన యోగ్యతాపత్రం యధాతధంగా మరో పోస్టులో ఇస్తున్నా.
లోడ్ అవుతోంది...
స్పందనలు