Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

ఆశయాన్ని చంపగల క్షిపణి భూమ్మీద ఇంకా పుట్టలేదు


ధన్యవాదాలు. నిన్న ప్రభాకరన్‌ మరణంపై పోస్ట్ చేసిన కథనానికి ఇంత తక్షణం స్పందించినందుకు కృతజ్ఞతలు....

http://raju123.mywebdunia.com/2009/05/19/1242724500000.html

శ్రీలంకలో 1950 నుంచి 1975 వరకు పార్లమెంటరీ పంధాలో అమృతలింగం వంటి తమిళ ప్రజాస్వామిక నేతలు పాతికేళ్ల పాటు శ్రీలంక పాలకులకు తమకూ సమాన హక్కులు కల్పించమని విన్నపాల మీద విన్నపాలు పెట్టుకుని విసిగిపోయిన క్షణంలోనే రెండు తరాల తర్వాత ప్రభాకరన్ రూపంలో తమిళ యువత తిరగబడింది.



జాఫ్నా యూనివర్శిటీలో విద్యార్థులను లంక పోలీసులు పిట్టలను కాల్చినట్లు కాల్చిన ఘటనే ప్రభాకరన్ సాయుధ పంధా చేపట్టడానికి నాంది పలికింది. అవమానాలు, కన్నీళ్లు, దశాబ్దాల రోదన ఉగ్రరూపం దాల్చి ఓ తరం యువతరాన్ని మండించిన క్షణంలో తమిళపులుల శకం మొదలైంది. ఆ తర్వాత చరిత్ర ఎవరు చెప్పినట్లు కూడా వినకుండా 2009 మే 17 వరకు తన దారిన తాను కొనసాగింది.

నిజమే మీరన్నట్లు శాంతియుతంగా కూడా పోరాటాలు ఫలించిన ఘటనలు చరిత్రలో ఉండవచ్చు. కాని డూ ఆర్ డై అనే నినాదంతో, క్విట్ ఇండియా అనే పిలుపుతో గాంధీ, జాతీయ కాంగ్రెస్ 1942లో ఇచ్చిన పిలుపుకు నాటి భారత జాతి హింసాత్మకంగా స్పందించి దేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగించిన హింసాత్మక, విధ్వంసక చర్యలే లేకుంటే ఇంగ్లండ్ ప్రభుత్వం భారత స్వాతంత్ర్యం గురించి అంత సత్వరంగా నిర్ణయం తీసుకుని ఉండేది కాదని చరిత్ర మనకు బోధిస్తున్న పాఠం.

గాంధీ మూడు దశాబ్దాల పాటు దేశంలో శాంతి, అహింసల జపం కొనసాగిస్తున్నప్పటికీ, దేశం నలుమూలలా 1919 నుంచి 47 వరకు ఎన్ని వందల తిరుగుబాట్లు జరిగాయో... ఎంతమంది అల్లూరిలు, భగత్‌సింగ్‌లు, ఉద్దం సింగ్‌లు, చంద్రశేఖర అజాద్‌లు సాయుధ పోరాటమే స్వాతంత్ర్య సాధన మార్గమని ఆ మూడు దశాబ్దాలుగా ప్రాణ త్యాగాలు చేశారో మనం అప్పుడే మర్చిపోలేదు కూడా. పోతే.. వేలాది మందిని బ్రిటిష్ వ్యతిరేక సైనికులుగా మార్చి అజాద్ హింద్ ఫౌజ్ నడిపించిన సుభాష్ చంద్రబోస్ పోరాటమార్గం ఏదో మనకు తెలుసు.

మన స్వాతంత్ర్య పోరాటంలో అహింసా మార్గం ఘనతను గుర్తిస్తూనే.. అంతకు మించి చెలరేగుతున్న హింసాత్మక ఘటనలను, పోరాటాలను, ప్రజల ఆగ్రహజ్వాలలను ఎన్నాళ్లో ఆపి ఉంచలేమని బ్రిటిష్ ప్రభుత్వం గ్రహించబట్టే కొంప పూర్తిగా మునిగితే కష్టం అంతిమ నిర్ణయం తీసుకుంది. ఇదీ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకున్నదే. శ్రీలంక చరిత్ర ఆద్యంతమూ శాంతియుత పంథాకు తలుపులు బిగించివేసిన చరిత్ర కాబట్టే తమిళ యువత అంతగా చెలరేగిపోయింది.

ఓ భావోద్వేగ సమయంలో రాసిన ఈ కథనం నూటికి నూరుపాళ్లు సరైందే అని నేను భావించడంలేదు. ప్రభాకరన్ గతి చూసి మనం కన్నీళ్లు కార్చినా, కార్చకపోయినా, ద్వేషించినా మనకు ఒరిగే దేమీ లేదు కాని.. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తమిళ డయాస్పోరా ఈరోజే శపథం చేసింది.

1950 నుంచి 75 దాకా శాంతియుతంగాను, 1976 నుంచి 2009 వరకు పరమ హింసాత్మకంగాను తమిళ జాతి కొనసాగించిన రెండు దశల పోరాటం లంకలో ముగిసిపోయిందని, తాము ఈరోజు నుంచే మూడో దశ పోరాటాన్ని అంతర్జాతీయ సమాజం మద్దతుతో కొనసాగిస్తామని, శ్రీలంక పాలకుల దౌష్ట్యాన్ని జెనీవా కోర్టులోకి లాగుతామని శపథం చేసింది. ఆశయం బుల్లెట్ ప్రూఫ్ వంటిదని, దానికి చావులేదని తమిళ దయాస్పోరా మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో అభిప్రాయపడింది.

ఆశయాన్ని చంపగల క్షిపణి భూమ్మీద ఇంకా పుట్టలేదు అనే వాక్యం ఈ సందర్భంలోనే నిజమవుతోంది. ఏదైమైనా నిన్నటి నా పోస్టింగ్‌పై అభిప్రాయం తెలిపిన అందరికీ ధన్యవాదాలు..

నిన్న ప్రభాకరన్‌పై పోస్ట్ చేసిన మూడు లింకులను ఇక్కడ చూడగలరు. చివరి రెండూ 2 తెలుగు వెబ్‌సైట్‌లనుంచి తీసుకున్నవి.

http://raju123.mywebdunia.com/2009/05/19/1242724500000.html

http://raju123.mywebdunia.com/2009/05/19/1242711960000.html

http://raju123.mywebdunia.com/2009/05/19/1242709140000.html

నిరాకరణ