Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

ఆయుధాలను, ఆశలనూ మోసుకు తిరిగినవాడు...



లక్ష తప్పులు చేసి ఉండవచ్చు కాని అతడు మన కాలం యోధుడు. మానవ వీరత్వాన్ని ఆత్మాహుతుల సాక్షిగా యుద్ధ చరిత్రకు పాఠాలుగా అందించిన వీరయోధుడు. అవును. ఓ తెలుగు దినపత్రిక సంపాదకుడు అన్నట్లు అతను ఆయుధాలను మాత్రమే కాదు ఆశలను కూడా మోసుకు తిరిగినవాడు. అమెరికా సారథ్యం వహిస్తున్న నూతన ప్రపంచంలో ఇటువంటి ఆశలకు చెల్లుబాటులేదని గుర్తించలేకపోయినవాడు.

మొఘల్ చక్రవర్తి అక్బర్‌పై రాణా ప్రతాప్ సింహుడు పాతికేళ్లు అడవుల్లో గెరిల్లా పోరాటం చేసి చివరి క్షణం వరకు స్వాతంత్యం కోసం, స్వేచ్ఛ కోసం జీవితాన్ని అర్పించాడని చరిత్ర పుస్తకాలలో చదువుతుంటే రక్తం పొంగుతుంది మనకు. లిబియా జాతి స్వేచ్ఛకోసం ఫాసిస్టు పాలనను ధిక్కరించి ఉరి కంబంపై ఎక్కిన క్షణాల్లో కూడా జాతికి కొత్త చూపునందించిన ఒమర్ ముక్తర్ గురించి చదువుతుంటే, సినిమాలో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి మనకు..

సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి... కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొని తెలుగునేలకు వీర రక్తంతో తిలకం దిద్దిన వైనం తల్చుకుంటే హృదయం ద్రవిస్తుంది.

కాని రాజీవ్ గాంధీని చంపించాడనే ఏకైక కారణంతో... 35 ఏళ్ల జీవితాన్ని లంక తమిళ జాతి కోసం అంకితం చేసి పోరాడి మరణించిన పెద్ద పులి ప్రభాకరన్ అంటే అందరికీ వ్యతిరేకతే. ఒకే దేశంలో రెండో తరగతి పౌరులుగా ఉండాల్సిన అవమానకరమైన జీవితాన్ని మనమూ అనుభవిస్తే తప్ప ఎవరికైనా పోరాటాల గురించి నేలకొరిగిన యోధుల గురించి అర్థం కాదేమో.

రక్తం పొంగే దివ్య స్మృతులతో ఈ దేశ యువతరాన్ని రగిలించే భగత్ సింగ్ కూడా బ్రిటిష్ సామ్రాజ్య వాదుల దృష్టిలో ఉగ్రవాదే.. పార్లమెంట్‌లో బాంబు విసిరిన నరరూప రాక్షసుడే. చరిత్రలో ఎన్ని ఘటనలు చదువుకోలేదు.. ఝాన్సీ రాణి, తాంతియాతోపే, అల్లూరి, వీరపాండ్య కట్టబ్రహ్మన్, ఎంతమంది వీరులను వీర నారీమణులను తల్చుకోలేదు మనం.. ప్రాణ త్యాగాలకు కరిగి భోరున విలపించలేదు.. కాని ప్రభాకరన్ మాత్రం మనిషే కాదు చాలామంది దృష్టిలో...

లేచింది మొదలుకుని ఈ నిమిషంలో, ఈ గంటలో ఎంత సంపాదిద్దాం అనే ఆలోచనలతో.. తడి గుడ్డతో గొంతు కోసే నిర్దాక్షిణ్యపు పోటీ ప్రపంచంలో ఎవరిని మన కాళ్ల కింద తొక్కే పడేసి మనం మాత్రం పైకి పోదాం అనే మూర్తీభవించిన పెను స్వార్ధపు నీచ, నికృష్టపు అల్ప బతుకులతో గడిపే మనకు.. ఉద్యమాల పట్ల, నమ్మిన లక్ష్యం కోసం ప్రాణాలు తృణప్రాయంగా అర్పించే ధీరుల పట్ల ఆలోచించే తీరిక, స్పూర్తి ఎక్కడుంది ఇప్పుడు?

బతకాలి కాబట్టి ఏదోలా బతికేస్తున్న వారు కూడా ఉద్యమాల గురించి, త్యాగాల గురించి బండకూతలు కూసేవారే.. వ్యక్తిగత, ఉద్యోగ జీవితం పొడవునా పెంచుకుంటూ వస్తున్న నానా రకాల మకిలితో, హృదయంలో ఏ మూలలో కూడా కాసింత నిజాయితీ అనేది లేకుండా బండబారిపోయిన పెద్దమనుషులం మనం... మరోవైపు తమ నీతి, నిజాయితీలను ప్రాణార్పణలతో భూమాత సాక్షిగా నిరూపించుకుంటున్న వారి గురించి అలవోకగా, చౌకబారుగా, లోకోద్ధారకులుగా ఫోజు కొట్టి మరీ వ్యాఖ్యానిస్తుంటాం.

నిజమే... వ్యాఖ్యానాలు, అడ్డగోలు రాతలు, మాటల రాయుళ్లదే రాజ్యమైపోయిందిప్పుడు. మానవ శ్రమను వ్యక్తిగత సామ్రాజ్య నిర్మాణం కోసం నిలువునా దోచుకుంటూ, సంపద సృష్టికర్తలుగా కొత్త బిరుదులు సంపాదించుకున్న పక్కా పెట్టుబడిదారులు ప్రపంచం గురించి వ్యాఖ్యానిస్తున్న ప్రస్తుత కాలంలో... నిజమైన చరిత్ర నిర్మాతలకు, వారి సామూహిక జీవన ఔన్నత్యానికి నిజంగా విలువ లేకుండా పోయిందేమో..

కిలినోచ్చి... ముల్లైతీవు... శ్రీలంక రాజధాని కొలంబోకు కేవలం 300 కిలోమీటర్ల దూరం మాత్రమే.. కాని గత ముప్పై ఏళ్లుగా పెద్దపులి, తన సహచరులు, అనుయాయులు లంక తమిళుల జాత్యవమానం సాక్షిగా శ్రీలంక రాజకీయాలను ఇంత చిన్న స్థలంలో ఉండి కూడా కదిలించివేశారు. ఇది చాలు.. ఒక జాతి వీరుడి ఉజ్వల జీవితం గురించి, అతడి అనుయాయుల సాహస కృత్యాల గురించి మరో వెయ్యేళ్లు వీరగానంతో పాడుకునేందుకు...

ఒక్కటి మాత్రం చెప్పగలను.. అతడు.... నా బంధువు కాదు... రక్తం పంచుకుని పుట్టిన వాడు కాడు... అమూల్యమైన మానవ ప్రాణాలను ఆత్మాహుతి బాంబులుగా మార్చి, లక్ష్యంకోసం అతడు ఎంచుకున్న హింసాత్మక పంధాతో రాజకీయ పరంగా కూడా నాకు ఏకీభావం లేదు.

కానీ.. 35 ఏళ్ల క్రితం చెన్నయ్ పాండీబజార్‌లో అనామకంగా తిరిగిన వాడు.., స్వంత దేశం శ్రీలంకలో విద్యాపరంగా, హక్కుల పరంగా తమిళజాతి యువత, విద్యార్థులు, తమిళ ప్రజలు రెండో తరగతి పౌరులుగా ఉంటున్న అవమానపు బతుకును చూస్తూ మనసు రగిలినవాడు.. 30 ఏళ్ల క్రితం ఓ సాధారణ లంక తమిళ విద్యార్థిగా మనలాగే హృదయం నిండా గంపెడాశలతో బతికిన వాడు.

తర్వాత... లంక ప్రభుత్వాల, మొద్దు బుద్ధుల అహంకారపు కండకావరానికి జాతిమొత్తంగా లంక తమిళుల ఆకాంక్షలు దహించుకుపోయిన చారిత్రక క్షణంలో పెద్దపులిగా మెరిశాడు. ఆపై జరిగిందంతా చరిత్రే...

మరణించిన తర్వాత అయినా సరే శతృత్వాలను పక్కన పెట్టి మనిషిని అంచనా వేసే మరో యుగం వస్తుందో లేదో తెలియదు. కాని 500 సంవత్సరాల చరిత్ర గడిచిన తర్వాత కూడా రాణా ప్రతాప్, శివాజీ జరిపిన గెరిల్లా పోరాటాన్ని నేటికీ తల్చుకుంటూండటం చూస్తున్నప్పుడు, రక్తప్లావిత ప్రపంచ వీరగాధా చరిత్రలో కొత్త నెత్తురు తడిగా వెలిసిన ప్రభాకరన్.. మనకేమీ కాని, మన రక్తబంధువు కాని ప్రభాకరన్... కథాపురుషుడిగా -లెజెండరీ- మనకాలం యోధుడిగా వెలుగొందుతాడు..

మానవ చరిత్ర మొదలై చాలా కాలమే గడిచింది. కానీ... ఓ చిన్న దేశంలో, ఓ చిన్న ప్రాంతంలో, శత్రువుకూ తనకు మధ్య 300 కిలోమీటర్ల స్వల్ప విస్తీర్ణంలో పులిలాగే తిరుగాడుతూ, దోబూచులాడుతూ, తన జాతికి పాలకులు చేసిన అవమానాలకు ప్రతీకారంతో దహించుకుపోతూ అంతిమంగా లక్ష్య సాధనలోనే బలైపోయిన వాడు గత రెండు వేల సంవత్సరాల చరిత్రలో కానరాడు. రేపు ప్రపంచం బహుశా అతడిని ఇలాగే గుర్తుంచుకోవచ్చు కూడా...

ప్రపంచంలో రెండో తరగతి పౌరులు అనే వారు ఉన్నంతవరకు... మాకెందుకు బతికే అవకాశాలు ఇవ్వరు అనే జీవితాకాంక్షలతో మనుషులు రగిలిపోయే కాలం కొనసాగుతున్నంతవరకు... జనం గుండె మండేలా పాలకులు జీవన వనంలో పిడిబాకులు విసిరే పరిస్థితి సమాజం ఉనికిలో ఉన్నంతవరకు ఒమర్ ముక్తర్, చేగువేరా, ప్రభాకరన్ కథాపురుషులుగానే వెలుగుందుతారు. మనకు ఇష్టమైనా,, ఇష్టం కాకపోయినా చరిత్ర వీరులను ఇలాగే గుర్తు పెట్టుకుంటూనే ఉంది.. ఉంటుంది కూడా...

"వెలుగుకు ద్వారాలు తెరుస్తాం మేం...
విఫలమైతే వేగుచుక్కలమై వెలుగుతాం మేం"

(రాజీవ్‌గాంధీ హత్యకేసులో ప్రధాన నిందితుడిగా నమోదై బెంగళూరులో ఆత్మాహుతికి పాల్పడిన శివరాజన్ సహచరి శుభ తన చేతిపై పొడుచుతున్న పచ్చబొట్టులో ఈ అక్షరాలు కనిపించాయి. )

ఒక్కటే చెప్పదల్చుకున్నాను.. ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ ప్రధాన స్రవంతి పత్రికలో పనిచేస్తున్న పరిమితులతో కాబోలు.. నిషిద్ధ నేతలకు నివాళి అర్హత లేదు అని హృదయభారంతోనే నేటి ఆంధ్రజ్యోతి పత్రికలో ఇలా -19-05-09- చెప్పుకున్నారు.

"తన జాతీయులు నివసించే పొరుగుదేశంతో, పోరాటంపై సానుభూతి కలిగిన జనమున్న దేశంతో శాశ్వత వైరానికి దారితీసే చర్యకు పాల్పడి అతడు చాలా పెద్ద తప్పు చేశాడు. అదే కాదు, ముప్పయ్యేండ్ల పోరాట జీవితంలో అతని తప్పులు చాలానే ఉన్నాయి. వీరోచిత అంతమో.. విషాదాంతమో... సోమవారం నాటి అతని నిష్ర్కమణకు దారితీసిన పరిస్థితుల్లో కడా స్వయంకృతం చాలా ఉండవచ్చు.

అయినప్పటికీ, తప్పులు మాత్రమే అతని జీవితం కాదు, ఒక మహోజ్వల పోరాటంలో భాగంగానే అతను అపరాధాలు చేశాడు, ఒక న్యాయమైన జనాకాంక్షకు ప్రతినిధిగానే అతను గుర్తింపు పొందాడు. సింహళ జాత్యహంకర పాలనలో బలి అవుతున్న చిట్టెలుకలను అతను పెద్దపులులు’గా తీర్చిదిద్దాడు.

వేలుపిళ్లై ప్రభాకరన్‌ అతని మంచిచెడ్డలు, వెలుగునీడలు అన్నిటితో కలిపి ఒక కథాపురుషుడు. సైనేడ్‌ గుళికను కంఠమాలగా అలంకరించుకున్న అతడు మరణంతో చెట్టపట్టాలు వేసుకుని సంచరించాడు. అత్యంత నిర్దాక్షిణ్యమైన, ఆత్మత్యాగ పూరితమైన గెరిల్లా పోరాటం నడిపిన అరుదైన యోధుడిగా అతడిని చరిత్ర గుర్తుంచుకుంటుంది."

శ్రీనివాస్ రాసిన పై మూడు పేరాల్లోని అక్షరాక్షరంతో ఏకీభవిస్తూ... ఓ జాతి యోధుడు మరో దేశంలో నిషిద్ధ ఉగ్రవాదిగా ముద్రపడి మరణ శిక్షకు పాత్రుడై, అవసరమైన సమయం లోనూ సహాయం పొందలేక పోయిన పరమ విషాదకర క్షణాల్లో ఇంతకు మించి ఏదైనా రాయడానికి, అనడానికి నాకు నోరు పెగలడం లేదు.

క్షమించండి..

ప్రభాకరన్ అమర్ హై...

ప్రభాకరన్ మృతదేహాన్ని గుర్తించినట్లు శ్రీలంక సైన్యం కాస్సేపటి క్రితం ప్రకటించింది.
1.30 PM

ఆశయాన్ని చంపగల క్షిపణిని ఈ భూమ్మీద ఇంకా కనిపెట్టలేదు
(ఒక దళారీ పశ్చాత్తాపం.. నుంచి)

ప్రభాకరన్‌పై తెలుగు సంపాదకుల అభిప్రాయం కోసం కింది లింకులు చూడండి.

http://andhrajyothy.com/editshow.asp?qry=/2009/may/19edit3
http://www.suryaa.com/showcinema.asp?category=1&subCategory=5&ContentId=418

స్పందనలు

Re: ఆయుధాలను, ఆశలనూ మోసుకు తిరిగినవాడు...
Dear Raju garu.....Even i too have the same feeling. And i wonder about ur article. Really i am telling u that while i am reading this article i very much disappointed.
ఆయుధాలను, ఆశలనూ మోసుకు తిరిగినవాడు...
ఉదయం నుంచీ, ప్రభాకరన్ చనిపోయి ఉండకపోతే బాగుండనని మనసులో అనుకుంటున్న నాకు.. మధ్యాహ్నం ఆయన మృతదేహం టీవీలో కనిపించడంతో నిర్ధారణ అయిపోయింది. టీవీలో ఆయనను చూస్తుంటే భోరున ఏడవాలని అనిపించింది. చుట్టూ అందరూ ఉండటంతో తమాయించుకుని అలాగే నిర్లిప్తంగా పని చేసుకుంటూ ఉండిపోయా. కానీ మీ బ్లాగును చూడగానే... మీరు ఆయన గురించి రాసిన ప్రతి వాక్యమూ చదువుతుంటే, నా కళ్ల వెంబడి నీరు ధారాపాతంగా కారసాగింది. నిజమే... ఆయుధాలతోపాటు, తమిళ ప్రజల ఆశలన్నింటినీ మోసుకు తిరిగిన ఆ వీరుడికి ఇంతకంటే నివాళులులేమీ అర్పించలేని స్థితిలో ఉన్నాం మనందరం. వీరుడా ప్రభాకరన్.. అమర్ హై...!!
Re: ఆయుధాలను, ఆశలనూ మోసుకు తిరిగినవాడు...
Dear Raju Unforgetable thing for every to learn from them with prabakaran i will agree with u with regadas Nagireddy.M Tirupati
Re: ఆయుధాలను, ఆశలనూ మోసుకు తిరిగినవాడు...
నాగిరెడ్డి గారూ.. చాలా కాలం తర్వాత మళ్లీ ఇలా కలుసుకున్నాం.. సునీత గారు బాగున్నారా? మనం తిరుపతి విడిపోయాక మళ్లీ కలుసుకోలేదు కదూ.. మీరు హైదరాబాద్‌లోనే ఉన్నారా మళ్లీ మారారా? నా మొబైల్ నంబర్ పాతదే. మీదీ మారలేదనుకుంటాను. నా పాత మెయిల్ ఐడి మారిపోయింది. ప్రస్తుతం దీన్ని వాడుతున్నా.. krajasekhara@gmail.com నా ప్రస్తుత వివరాలతో మీకు త్వరలో మెయిల్ పంపుతాను.
Re: ఆయుధాలను, ఆశలనూ మోసుకు తిరిగినవాడు...
మిత్రునికి.... ప్రభాకరన్ సాయుధ పోరాటంపై చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రభాకరన్ సాయుధ పోరాటాన్ని మన అల్లూరి, రుద్రమదేవి వంటి వీరులతో పోల్చారు. బాగానే ఉన్నది. అయితే గత 2 వేల సంవత్సరాల కాలంలో ప్రభాకరన్ వంటి వీరోచిత వ్యక్తి లేనేలేడన్నారు. మరి మన అల్లూరి, రుద్రమదేవి వంటి వారు అంతటి వీరోచితులు కాదంటారా...? తెల్లదొరల పాలనను అంతం చేసి స్వేచ్ఛా స్వాతంత్రాలను భావి తరాలకు అందించేందుకుగాను పోరాడి వీరోచిత మరణం పొందిన ప్రతి భారతీయుడు నా దృష్టిలో గొప్ప వీరుడే. మరొక విషయం, సాయుధ పోరాటంతో సాధించలేనిది అహింసా మార్గంలో సాధించవచ్చని మన బాపూజీ, దక్షిణాఫ్రికాలోని నెల్సన్ మండేలా వంటివారు రుజువు చేశారు. ఆ మార్గమూ లక్ష్య సాధనకు అనువైనదే కదా.. ఏమంటారు...
Re: ఆయుధాలను, ఆశలనూ మోసుకు తిరిగినవాడు...
NO words to say - Jana
Re: ఆయుధాలను, ఆశలనూ మోసుకు తిరిగినవాడు...
మీ ఆర్టికల్ చదవక ముందు వరకు ప్రభాకరన్‌పై సదభిప్రాయం లేదు. అలాగని ఎవరి దగ్గరా ఈ విషయంపై వాదించలేదు. మీ ఆర్టికల్ చదివాక.. లక్ష్య సాధనలో కొన్ని అపశృతులు దొర్లడం అనేది సహజం.. అలాగని సమాజంచే కీర్తించబడే అతి గొప్ప నేతలను పొట్టనబెట్టుకోవడం అమానుషం కదా. అంటే ఆ గొప్ప నేతలకు నేను మద్దతు ఇస్తున్నానని కాదు సుమా. వాట్ ఎవర్ ఇట్ మే బీ.. 'వీరుడన్నవాడు విఫలమైతే వీరమరణం పొందుతాడు'. మంచి ఆర్టికల్ అండి.. ఈ ఆర్టికల్‌లో మరికొన్ని వివరాలను మీరు ప్రస్తావించలేదనిపిస్తోంది. వీలైతే అందించగలరు. రాజు గారు బాగున్నారా..?
Re: ఆయుధాలను, ఆశలనూ మోసుకు తిరిగినవాడు...
రాజుగారు సార్... చాలా రోజులు తర్వాత మీ నుండి నేను ఈ వ్యాసాన్ని నాకు పంపారు... నిజంగా మీరు చెప్పినట్లు ఆయుధం పట్టినవాడు ఆ ఆయుధానికి బలి అవుతాడని పెద్దలు చెప్పారు... ఆయుధం పట్టే ముందు ఆలోచించాల్సిన విషయాన్ని ప్రాణంమీదకు వచ్చిన తర్వాత ఆలోచిస్తున్నారు అంతా... కాని మీరు అన్నట్లు ప్రభాకరన్ శ్రీలంకలోని ఉన్న తమిళ ప్రజలకు స్వేచ్ఛా గాలలను అందించాలని పోరాటం చేసాడు... అది నిజంగా మంచి పనే....
Re: ఆయుధాలను, ఆశలనూ మోసుకు తిరిగినవాడు...
నా కథనంపై అభిప్రాయాలు వ్రాసిన అందరికీ నెనర్లు. స్థలాభావ సమస్య ఏర్పడుతుందనే భయంతో వీటికి స్పందనను "ఆశయాన్ని చంపగల క్షిపణి భూమ్మీద ఇంకా పుట్టలేదు" అనే కొత్త పోస్టింగ్‌లో ఉంచాను. వీలయితే కింది లింకును చూడగలరు. http://raju123.mywebdunia.com/2009/05/19/1242724500000.html
నిరాకరణ