-కె.శ్రీనివాస్
పనివారిగా సంపాదించడం, వినియోగదారులుగ ఖర్చుచేయడం- ఈ రెండే జీవన వ్యాపారాలైన స్వర్ణ యుగంలో తన కోసం కాకుండా తనలాంటి వారికోసం, తనవారికోసం జీవించేవారే అరుదు. రాజీపడడం, బేరాలు చేయడం, ఆచరణాత్మకత పేరుతో అవకాశవాదాన్ని వరించడం నేటి లోకంలో నెగ్గగలిగేవారి నీతి. అందుకే, పాత తరం యోధులందరూ ఒక్కొక్కరుగ రాలిపోతున్నారు, లేదంటే సోలిపోతున్నారు.
రెండు నిమిషాల మౌనం ఒక కన్నీటి చుక్క కసేపు హృదయభారం-బహుశా వీటికి అనుమతి లేదు. నిషిద్ధనేతలకు నివాళి అర్హత లేదు. ఉగ్రవాదికి కళేబరమే తప్ప భౌతిక కాయం ఉండదు. కీర్తికాయం అసలే ఉండదు. వద్దు, మాట్లాడకూడదు. విశ్వాసాల ఆకాంక్షల ఆత్మగౌరవాల హక్కుల స్వేచ్ఛల వంటి కాలం చెల్లిన పదజాలాన్ని ప్రస్తావించకూడదు, కార్యకారణాల కోసం కాలనాళికలోకి పయనించకూడదు. సమస్య తుపాకితోనే మొదలైందని, తుపాకితోనే అంతమయిందని తృప్తిపడాలి.
రాజీవ్‌గాంధీని అతడు హత్య చేయకుండా ఉంటే భారతీయుల హృదయలు కొన్నైనా అతనికోసం, ఇంతటి అవకశవాద యుగంలోనూ, బాహాటంగానే పరితపించి ఉండేవి. రాజీవ్ హత్యకు పూర్వపరాలేమిటి, ఏ పరిస్థితులు అందుకు దారితీశాయి అన్న చర్చ పక్కనబెడితే, తన జాతీయులు నివసించే పొరుగుదేశంతో, పోరాటంపై సానుభూతి కలిగిన జనమున్న దేశంతో శాశ్వత వైరానికి దారితీసే చర్యకు పాల్పడి అతడు చాలా పెద్ద తప్పు చేశాడు. అదే కాదు, ముప్పయ్యేండ్ల పోరాట జీవితంలో అతని తప్పులు చాలానే ఉన్నాయి. వీరోచిత అంతమై, విషాదాంతమై సోమవారం నాటి అతని నిష్ర్కమణకు దారితీసిన పరిస్థితుల్లో కడా స్వయంకృతం చాలా ఉండవచ్చు.
అయినప్పటికీ, తప్పులు మాత్రమే అతని జీవితం కాదు, ఒక మహోజ్వల పోరాటంలో భాగంగానే అతను అపరాధాలు చేశాడు, ఒక న్యాయమైన జనాకాంక్షకు ప్రతినిధిగానే అతను గుర్తింపు పొందాడు. సింహళ జాత్యహంకర పాలనలో బలి అవుతున్న చిట్టెలుకలను అతను పెద్దపులులు’గా తీర్చిదిద్దాడు. వేలుపిళ్లై ప్రభాకరన్ అతని మంచిచెడ్డలు, వెలుగునీడలు అన్నిటితో కలిపి ఒక కథాపురుషుడు. సైనేడ్ గుళికను కంఠమాలగా అలంకరించుకున్న అతడు మరణంతో చెట్టపట్టాలు వేసుకుని సంచరించాడు. అత్యంత నిర్దక్షిణ్యమైన, ఆత్మత్యాగ పూరితమైన గెరిల్లాపోరాటం నడిపిన అరుదైన యోధుడిగ అతడిని చరిత్ర గుర్తుంచుకుంటుంది.
మూడు నాలుగు నెలలుగా శ్రీలంకలో ప్రభుత్వ దళాల విజయపరంపర అవిచ్ఛిన్నంగా సాగుతున్నది. తమిళ పౌరులు కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని యుద్ధప్రాంతం నుంచి తరలివస్తున్నారు. సముద్రం దాటి భారతదేశానికీ శరణార్థులుగా వస్తున్నారు. అయినా మన దేశంలో సానుభతి గోరువెచ్చగానే మిగిలింది. అదొక ఎన్నికల అంశంగానే నలిగింది.
లండన్‌లోనూ, వాషింగ్టన్‌లోనూ, ప్యారిస్‌లోనూ ప్రదర్శనలు జరిగాయి కానీ, దేశంలో ఎక్కడా చెప్పుకోదగ్గ స్పందనే కనిపించలేదు. ఇరాక్ యుద్ధం సందర్భంగా కనిపించినంత కలవరం కూడా ఎక్కడా లేదు. వైగో మాట్లాడతాడు, కొత్తగా జయలలితా మాట్లాడింది. పరిస్థితి చేజారుతుందేమోనని కరుణానిధి లేఖలు రాశాడు, ఉపవాసదీక్ష చేశాడు. ఢిల్లీనుంచి దూతలు హుటాహుటిన కొలంబో వెళ్లి ఏవో మంతనాలు జరిపారు.
ఎన్నికలు కదా, యుపిఏకు తమిళనాడు ఓట్లు చాలా ముఖ్యం కదా, ప్రభాకరన్ స్థావరం దగ్గరికొచ్చేసాం, రేపో మాపో తుడిచిపెట్టేస్తాం అని లంకనేతలు చెబుతుంటే మనవాళ్లకు ముచ్చెమటలు పోశాయి. మే 13 పోలింగ్ ముగిసేదాక చివరిదాడి’ జరపబోమని రాజపక్సే హామీ ఇచ్చినట్టున్నాడు, కరుణానిధి దీక్ష ముగిసింది, ఢిల్లీ కలవరం చల్లారింది.
ఆదివారం నాడు జోర్డన్ పర్యటన ముగించుకుని లంక నేలపై కాలుపెట్టిన వెంటనే మాతృభమిని రాజపక్సే ముద్దాడినప్పుడే ప్రపంచానికి ఉప్పందింది. భారతదేశం నుంచి బుద్ధసందేశాన్ని శ్రీలంకకు తీసుకువెళ్లిన మహేంద్రుడి పేరుపెట్టుకున్న రాజపక్సే ముఖంలో నెత్తుటి విజయపు రెపరెపలు అప్పుడే కనిపించాయి. నిజానికి తమిళనాడులో కూడా అంత సీనులేదు. తమిళ జాతీయవాదం, భాషాభిమానం వంటి వాటికి ప్రపంచీకరణయుగంలో విలువలేదని అక్కడి జనానికి కూడా క్రమక్రమంగ తెలుస్తున్నట్టుంది.
రాజీవ్‌ను హత్యచేసి, భారతజాతి దృష్టిలో తమను దోషులుగ నిలబెట్టినందుకు తమిళులకు టైగర్ల మీద వచ్చిన కోపం న్యాయమైనదే. అయితే, శ్రీలంక తమిళుల పోరాటం న్యాయమైనదని నమ్ముతున్నందున ఆ కోపం ఆగ్రహంగా మారలేదు. ప్రభాకరన్ కాకపోయినా ఎల్టీటీఈ వారి దృష్టిలో ఒక హీరోగానే నిలచిపోయింది. కనీ, కాలం మారుతున్న కొద్దీ, లంక తమిళులపై సహానుభూతి పలచబడుతూ వచ్చింది. ఈ వాస్తవాన్ని గ్రహించలేకనో, ప్రత్యర్థి పక్షాల వారు సొమ్ముచేసుకుంటారనే భయం వల్లనో- ప్రభాకరన్ మరణాన్ని వాయిదా వేయలని అధికారపక్షం ప్రయత్నించింది.
కానీ, తమిళనాడులో లంక సమస్యకు ఇప్పుడంత ప్రభావం ఉన్నట్టు లేదు. ఉంటే, టైగర్లను ప్రశంసించి ఉగ్రవాదిగా జైలుకు కూడా వెళ్లివచ్చిన వైగో ఎందుకు ఓడిపోతాడు. ఒక పక్కన ప్రభాకరన్ మరణవార్త సమాచార సాధనాలలో మారుమోగుతుంటే, కరుణానిధి కొత్త యుపిఎ మంత్రివర్గంలో తన కుమారుడికి, కుమార్తెకు స్థానం కోసం ఎందుకు పైరవీలు చేయగలుగుతాడు
ఒకనాడు దేశాన్ని కుదిపివేసిన పరిణామాలలో కీలక పాత్రధారి అయిన ఎల్టీటీఈ అవసాన వార్తలపై ఆసక్తి లేకుండా యువత అంతా సాయంత్రపు ఐపీఎల్ మ్యాచ్‌లకే ఎందుకు కళ్లప్పగించింది ప్రభాకరన్ మరణం ఎందుకు బాధ కలిగిస్తుందంటే, అతను ఆయుధాలను మాత్రమే కాదు ఆశలను కూడా మోసుకు తిరిగినవాడు. అమెరిక సారథ్యం వహిస్తున్న నూతన ప్రపంచంలో ఇటువంటి ఆశలకు చెల్లుబాటు లేదని గుర్తించలేకపోయినవాడు.
అతను, అతని సైన్యం అంతరించినా లంక సమస్య అంతర్ధానం కాదు, పరాజితులైన తమిళులు అవమానాన్ని ఒక అనివార్య వాస్తవికతగా అంగీకరిస్తే తప్ప. మహింద రజపక్సే, నువ్వు టైగర్ల అధీనంలోని ప్రతి అంగుళాన్నీ తిరిగి స్వాధీనపరచుకున్నావు, కానీ, ఒక్క తమిళుని మనసులోనైనా అణువంత స్థానం సంపాదించుకున్నావా..
అయినా, సరే నువ్వు విజయోత్సవాలు జరుపుకుంటున్నావు, మృతదేహాల గుట్టల మీద సింహళ పతాకను ఎగురవేస్తున్నావు. బహుశా, ఇప్పటికి నీబోటి వారిదే విజయం, నీ వంటివారిదే కలం. నీ టీతోటలకు పూర్వవైభవం వస్తుంది, టూరిజంతో నీకు డాలర్లు కురుస్తాయి, ఒకప్పుడిక్కడ నెత్తురు పారిందని మరచిపోయి, అంటుగట్టిన బోధివృక్షాన్ని చూడడానికి శాంతి కాముకులంతా వరుసకడతారు.
పనివారిగ సంపాదించడం, వినియోదారులుగ ఖర్చుచేయడం- ఈ రెండే జీవన వ్యాపారలైన స్వర్ణ యుగంలో తన కోసం కకుండా తనలాంటి వారికోసం, తనవారికోసం జీవించేవారే అరుదు. రాజీపడడం, బేరాలు చేయడం, ఆచరణాత్మకత పేరుతో అవకాశవాదాన్ని వరించడం నేటి లోకంలో నెగ్గగలిగేవారి నీతి. అందుకే, పాత తరం యోధులందరూ ఒక్కొక్కరుగ రాలిపోతున్నారు, లేదంటే సోలిపోతున్నారు.
లక్షమంది ప్రాణత్యాగంతో ముడిపడిన లంక పోరు- చివరకు ఒక్క అంగుళం నేలను కూడా తమిళులకు సాధించిపెట్టలేకపోయింది. టెర్రరిస్టు చట్రంలోకి ఇమిడిపోయిన పంజాబ్ ప్రజల ఫెడరల్ ఆకాంక్ష- వేల మరణాల తరువాత సైతం ఒక అడుగు ముందుకు వేయలేకపోయింది.
దశాబ్దాల రక్తసిక్త చరిత్ర తరువాత పాలస్తీనా ఇంక ప్రారంభం కాని విజయంగానే మిగిలిపోయింది. ఫిలిప్పీన్స్ నడిదారిలోనే ఓడిపోయింది. ఎంత ప్రతిఘటన ఇచ్చి కూడా ఇరాక్ ఉక్కుపాదం కిందే నలిగిపోతోంది. అసహనాన్ని అణచిపెట్టుకుని సాధుమార్గంలో నడుస్తున్న తెలంగాణ- తన నిగ్రహానికి బదులుగా ఒక్కటంటే ఒక్కటి కూడా పరిహారన్యాయం పొందలేకపోతున్నది. వీటన్నిటి నడుమ లంక తమిళుల ఓటమి, ఆశల ఆశయాల సాధన కోసం జరిగే ప్రయత్నాలన్నిటికీ మరింత నిస్పృహను జోడిస్తున్నది.
(ఆంద్రజ్యోతి పత్రిక సౌజన్యంతో..)
లోడ్ అవుతోంది...