Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

పులివేట పరిసమాప్తం


ప్రభాకరన్‌ నేలకొరిగి పోవడంతో అక్కడ తమిళుల ఆందోళనలో, ప్రతిఘటనలో విరామం ఏర్పడవచ్చు. అది దీర్ఘకాలమూ కావచ్చు. స్వల్పకాలమూ కావచ్చు. దానిని వినియోగించుకొని శ్రీలంక తమిళులకు సింహళీయులతో సమానమైన, ఆత్మగౌరవ ప్రధానమైన న్యాయం జరగడానికి, రాజకీయంగా ఆ ప్రాంతం వీలైనంత స్వయంపాలన హక్కులు పొందేలా చూడడానికి అంతర్జాతీయ సమాజం నడుం బిగించాలి. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె కూడా యుద్ధ విజయాలతో హద్దులు మీరిన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోకుండా దేశమంతటా మానవ హక్కుల పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేయాలి.

యుద్ధనీతి అంటారేగాని, దానికి నీతి అనేది ఉండదనేది కఠోర వాస్తవం. పురాణగాథల్లోనైనా, చరిత్రలోనైనా జరిగిందిదే. చంపదగిన శత్రువైనా చేత చిక్కినప్పుడు చంపకుండా ఉండడమే ధర్మమని ఎందరెన్ని నీతులు చెప్పినా ఆచరణలో అందుకు విరుద్ధంగానే జరుగు తున్నది. శ్రీలంకలో సైన్యానికి, తమిళపులులకు ఇంతకాలం సాగుతూ వచ్చినది వాస్తవానికి యుద్ధం కాదు- శ్రీలంక సైన్యం ఏకపక్ష విజృంభణ.

పెద్ద పులి ప్రభాకరన్‌ ఆయన, ముఖ్య అనుచరులు సైన్యం కాల్పులలో మరణించినట్టు కొలంబో అధికారికంగా ప్రకటించడంతో అక్కడ యుద్ధం అంతమైంది. వేలు పిళుపిళ్లై ప్రభాకరన్‌ వేగుచుక్కై వెలిగి నడిపించిన ఒక సుదీర్ఘ శకం ముగిసింది. ఎల్‌టిటిఇ కాల్పులు విరమిస్తున్నట్టు పదే పదే ప్రకటించినా అందుకు ప్రతిగా సానుకూలంగా స్పందించకుండా సైన్యం దాడులు కొనసాగించింది.

వేలాది, లక్షలాది తమిళ నిర్వాసితుల, క్షతగాత్రుల ఆక్రందనల మధ్య ముందుకు చొచ్చుకు పోయి అగ్నివర్షం కురిపిస్తూనే వచ్చింది. తాజాగా ఆదివారంనాడు టైగర్లు చేతులు ఎత్తివేస్తూ చేసిన లొంగుబాటు ప్రకటనను కూడా పట్టించు కోకుండా దూసుకుపోయిన లంక సైన్యం పట్టులోని కోడిపిల్లల్లా దొరికిన పెద్ద పులి ప్రభాకరన్‌ను, ఆయన కుమారుడు ఆంథోనీని, ఆయన ముఖ్య సహచరులు పొట్టు అమ్మన్‌, సుసోయ్ తదితరులను మట్టుబెట్టినట్టు అవగతమవుతున్నది.

వ్యక్తిగత ఘర్షణలలోనే శత్రువు లొంగుబాటును గుర్తించి రాజీ చర్చలకు దారి ఏర్పరుస్తారు. ఒకవర్గం ప్రజల తరఫున వారి స్వేచ్ఛా స్వాతం త్య్రాల కోసం దుస్సాహసిక గెరిల్లా దాడులకు తలపడి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ కాలం పోరు సల్పిన ఎల్‌టిటిఇ ఓటమిని అంగీకరించిన దశలో అగ్రనేతలు ప్రాణాలతో బయటపడి రాజీకి వచ్చే అవకాశం కలగ కపోవడం బాధాకరం.

నిజమే, ప్రభాకరన్‌ అత్యంత మొండివాడు. ఆత్మాహుతి బాంబు దాడులతో రాజీవ్‌ గాంధీని, ప్రేమదాసను, ఎంతోమంది అమాయకుల ప్రాణాలను హరించిన నరరక్త పిపాసి. లొంగినట్టే లొంగి తప్పించుకోగల సమర్ధుడు. శాంతిపర్వాన్ని మరో భీషణ హింసాధ్యాయానికి బాటగా ఉపయోగించుకోగల వ్యూహ నేర్పరి. అటువంటి ఉగ్రవాది, ఆయన బృందం ఇలా సైన్యం చేతిలో దారుణంగా హతులు కావడం ఆశ్చర్య పోవలసిందేమీ కాదు. కాని శ్రీలంక తమిళ ప్రజల తిరుగు బాటు సమస్యకు ఇది ఎంత మాత్రం పరిష్కారం కాజాలదు.

ప్రభాకరన్‌ దళాలు మృత్యువును మెడలో వేలాడదీసుకొని మూడు దశాబ్దాల పాటు సాగించిన అమిత హింసాత్మకమైన ప్రతిఘటనకు మూలంలో శ్రీలంక తమిళులు అనుభవిస్తూ వచ్చిన దుర్భర పరిస్థితులు, సింహళీయ పాలక వర్గాల అణచివేత ఉన్నాయనే అంశాన్ని దృష్టిలో ఉంచు కున్నప్పుడు పెద్దపులికి ఆయన సహచరులకు ఇటువంటి విషాదాంతం ప్రాప్తించ కుండా ఉండవలసిందనుకోవడాన్ని ఎంతమాత్రం ఆక్షేపించలేము. సకాలంలో అంతర్జాతీయ సమాజం కలుగుజేసుకొని ఈ ఘట్టాన్ని నిలు వరించి టైగర్ల అగ్రనేతలను సజీవంగా పట్టుకొనే వాతావరణాన్ని సృష్టించి ఉండవలసింది.

అయితే గతంలో నార్వే వంటి దేశాలు, అంతకు ముందు భారతదేశం కూడా సాగించిన దౌత్యాన్ని, శాంతియుత పరిష్కా రానికి చేసిన కృషిని వమ్ము చేసిన చరిత్ర టైగర్లకున్నది. 2002లో నార్వే ఆధ్వర్యంలో ప్రారంభమైన శాంతి సంభాషణలు నాలుగేళ్ళు నత్త నడకగా సాగి తుదకు అర్థాంతరంగా ముగిసిపోవడంతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె అన్ని విధాలా పెంచుకున్న సైనిక సామర్ధ్యంతో తమిళ ప్రాంతాలపై యుద్ధానికి తలపడ్డాడు. ఈసారి సైన్యం అప్రతిహతంగా ముందుకు సాగిపోయింది.

2002 డిసెంబర్‌ 5వ తేదీన శ్రీలంకలో భాగంగా తమిళ ప్రాంతాలలో తాత్కాలిక స్వయం పాలక వ్యవస్థ ఏర్పాటు ప్రాతిపదికగా చర్చలకు అటు ప్రభుత్వం ఇటు టైగర్లు సూత్రప్రాయంగా అంగీకరించారు. నార్వే ఆధ్వర్యంలో కుదిరిన ఈ ఫెడరల్‌ సహజీవన అంగీకారం సత్ఫలితాలు ఇవ్వగలదని ఆశించిన తరుణంలో ఎల్‌టిటిఇ కాల్పుల విరమణను ఉల్లంఘించి శ్రీలంక సైన్యానికి పని చెప్పింది. బాలలను దళాలలోకి రి క్రూట్‌ చేసుకోరాదని కుదుర్చుకున్న ఒప్పందాన్ని కాలరాసింది.

సాటి తమిళ రాజకీయ గ్రూపులపై కక్ష సాధింపు చర్యలకు తలపడబోమని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ఎల్‌టిటిఇని ఉగ్రవాదసంస్థగా, శాంతి చర్చలకు ఏ మాత్రం సహకరించని మొండిగా అంతర్జాతీయ సమాజం ముందు రుజువు చేయడంలో కృతకృత్యుడైన మహీంద రాజపక్సె అదే అదనుగా శ్రీలంక తమిళ ప్రాంతాలపై సైన్యం అగ్నివర్షాన్ని తీవ్రతరం చేయించాడు.

సైన్యం దాడుల కారణంగా శ్రీలంక తూర్పు, ఉత్తర ప్రాంతాలలో మిన్నుముట్టిన అమాయక, నిస్సహాయ తమిళ ప్రజల ఆక్రందనలను పట్టించుకోకుండా తక్షణం లొంగి పోవాలంటూ ఎల్‌టిటిఇకి మొన్న ఫిబ్రవరి నెలలో అమెరికా, యూరపు యూ నియన్‌, జపాన్‌, నార్వేలు విజ్ఞప్తిచేయడం గమనార్హం. జర్నలిస్టులను, పరిశీలకులను అనుమతించకుండా లంక సైన్యం తమిళ ప్రాంతాలపై అదేపనిగా భీషణ దాడులు జరిపింది. టైగర్ల పట్టులోని కిల్లినోచ్చిని దిగ్బంధనం చేసింది.

ప్రభాకరన్‌, ఆయన సహచరులు పారిపోకుండా సముద్రపు అలల మీద గట్టి నిఘా ఉంచింది. అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి ఇంతగా ప్రాధా న్యమిచ్చి జోక్యం చేసుకున్న శ్రీలంక జాతుల సమస్య ఇలా ఏక పక్ష యుద్ధోన్మాద విజయంతో రక్తసిక్తం కావడం ఏమి చెబుతున్నది ఒక జాతిని ఇంకొక జాతి అణచివేసినందున ఉత్పన్నమైన హింసాయుత తిరుగుబాటుకు ఈ ప్రజాస్వామిక యుగంలో కూడా యుద్ధమే పరిష్కారం కావడం కంటె బాధాకరం మరొకటి ఉండదు.

సరిగ్గా మన దేశంలో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన రెండు రోజు లలోనే పెద్ద పులి ప్రభాకరన్‌ను కాల్చి చంపడం గమనించవలసిన విషయం. తమిళనాడులో బరిలోని రాజకీయ పార్టీలు టైగర్ల పట్ల, శ్రీలంక తమిళుల పట్ల ప్రదర్శించిన అభిమానం, కేంద్రంపై డిఎంకె తీసుకువచ్చిన ఒత్తిడి ఓటు వేట సాధనాలేనని రుజువైపోయింది. మూడు దశాబ్దాలుగా సాగి 70వేల మందిని పొట్టనపెట్టుకున్న శ్రీలంక తమిళ ప్రాంతాలలో అశాంతి ఇంతటితో అంతమైపోయిందని అనుకోవడం అవాస్తవికమే కావచ్చు.

అయితే ప్రభాకరన్‌ నేలకొరిగి పోవడంతో అక్కడ తమిళుల ఆందోళనలో, ప్రతిఘటనలో విరామం ఏర్పడవచ్చు. అది దీర్ఘకాలమూ కావచ్చు. స్వల్ప కాలమూ కావచ్చు. దానిని వినియోగించుకొని శ్రీలంక తమిళులకు సింహళీయులతో సమానమైన, ఆత్మగౌరవ ప్రధానమైన న్యాయం జరగడానికి, రాజకీయంగా ఆ ప్రాంతం వీలైనంత స్వయంపాలన హక్కులు పొందేలా చూడడానికి అంతర్జాతీయ సమాజం నడుం బిగించాలి.

శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె కూడా యుద్ధ విజయాలతో హద్దులు మీరిన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోకుండా దేశమంతటా మానవ హక్కుల పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేయాలి.

(సూర్య.కామ్ వెబ్‌సైట్ సౌజన్యంతో..)

నిరాకరణ