Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

స్లమ్‌డాగ్ మిలియనీర్ నవలకు ఆదరణ


స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను దక్కించుకుంది. గురువారం ఈ చిత్రానికి పది ఆస్కార్ నామినేషన్లు లభించడంతో ఈ చిత్ర మూల కథారచయిత అయిన వికాస్ స్వరూప్ క్యు అండ్ ఎ నవలకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది.

ఈ పుస్తకం ప్రతి కావాలంటూ అనేకమంది తనకు ఈ-మెయిల్స్ పంపుతున్నారని, ఇంటర్వూకోసం పలువురు అభ్యర్తిస్తున్నారని, వికాస్ చెప్పారు. సినిమా సాధించిన అసాధారణ విజయం నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తోందని తెలిపారు. హాలీవుడ్‌లో సినిమా రూపంలో విజయం సాధించిన తర్వాతే తన నవలను చదివే పాఠకుల సంఖ్య బాగా పెరిగిందని అన్నారు.

తన పుస్తకానికి ప్రస్తుతం లభిస్తున్న ఆదరణకు సినిమాయే కారణమని వికాస్ శషభిషలు లేకుండా అంగీకరిస్తున్నారు. భారత్‌లో సినిమాలే ఏకైక మాస్ మీడియాగా అవతరించిన విషయాన్ని మనం మర్చిపోరాదని గుర్తు చేశారు. సినిమా విజయంతో తన అసలు నవల క్యు అండ్ ఎ మరింతమందికి చేరే అవకాశం ఉంటోందని చెప్పారు.

ప్రపంచం సెలబ్రిటీల చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత కాలంలో తన నవల సినీరూపం విజయం సాధిస్తోందని, దీంతో ప్రచురణ కర్తలు తన నవల అసలు పేరును సైతం మార్చి నవలకు సైతం స్లమ్‌డాగ్ మిలియనీర్ అనే పేరు పెట్టి అమ్మకాలు ప్రారంభించారని వికాస్ చమత్కరించారు. ఇది వ్యాపార నిర్వహణలో భాగంగానే సాగుతోందని, పుస్తకాల షాపుల్లో పాఠకులు సులభంగా ఎంచుకోవడానికి పేరు మార్పు అనేది ఓ మేరకు ఉపయోగపడుతుందని చెప్పారు.

అయితే తన పుస్తకానికి లభిస్తున్న అనూహ్య ఆదరణ కొంతకాలానికి తగ్గుముఖం పడుతుందని, అయితే నవల విశిష్టతను సినిమా రూపం మార్చలేదని వికాసం చెప్పారు. సినిమా క్రేజీ తగ్గుముఖం పట్టగానే పుస్తకం తిరిగి ముందు పీఠికి వస్తుందని చెప్పారు. ఆవిధంగా సాహిత్యమే అంతిమంగా విజయం సాధిస్తుందని వికాస్ తాత్వీకరించారు.

భారత్‌ ఆధారంగా తాను ఇప్పటికే రెండు పుస్తకాలు రాసినందున మూడో పుస్తకం భారత అధారంగా ఉండదని వికాస్ చెప్పారు. తనకు ప్రస్తుతం కొత్త ప్రేరణ, కొత్త ఇతివృత్తం కావాలని అభిప్రాయపడ్డారు.

ఈ కథకు ప్రేరణగా నిలిచిన ఘటనలు వినడానికి ఆసక్తి గొలుపుతాయి. చాలా కాలం క్రింత తన జన్మస్థలమైన అలహాబాద్‌లో సెలవులు గడిపేందుకు వికాస్ వెళ్లినప్పుడు ఈ కథ రేఖామాత్రంగా వికాస్‌కు తట్టింది. కాలేజీ రోజులనుంచే వికాస్‌కు క్విజ్ అంటే ప్రాణం. అప్పట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నిర్వహించిన సుప్రసిద్ధ క్విజ్ ప్రోగ్రాం వికాస్ సాహితీ భావుకతను ప్ర్రేరేపించింది. తర్వాత అయిదు సంవత్సరాల క్రితం లండన్‌లో భారతీయ హైకమిషన్ కౌన్సిలర్‌గా ఉంటున్నప్పుడు సాయంత్రం వేళల్లో క్యు అండ్ ఎ నవలను రాయడం మొదలు పెట్టారు. తర్వాత జరిగిన కథ మనందరికీ తెలుసు..

స్పందనలు

Re: స్లమ్‌డాగ్ మిలియనీర్ నవలకు ఆదరణ
క్షమించాలి సార్,,,, పది ఆస్కార్ అవార్డులు వచ్చాయని చెప్పారు,.... పది ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయ్యింది అంతేకాని ఇంకా పది అవార్డులను సొంతం చేసుకోలేదని నా అభిప్రాయం. దయచేసి ఇది తప్పు అయితే క్షమించండి. అయితే ఇటువంటి మంచి విషయాలు మాకు ఇంకా చెప్పాలని కోరుకుంటూ... మీ హర్ష
Re: స్లమ్‌డాగ్ మిలియనీర్ నవలకు ఆదరణ
ఆర్యా ! రాజశేఖర్ గారూ ! మీ బ్లాగు టపాల (blog posts) గురించి మీరెవ్వరికీ వేగు (mail) పంపే పనిలేదు. నానాదేశాలకి చెందిన వేలాదిమంది తెలుగు పాఠకులు అనునిత్యమూ సందర్శించే కూడలి http://koodali.org సైటులో Select 100 blogs Category (కూడలి 100) లో మీ బ్లాగు ఇప్పటికే జాబితా కట్టబడింది. ఆ విధంగా మీకు తెలియకపోయినా మీ టపాల్ని ఇప్పట్టికే వందలాదిమంది చదువుతూ ఉండొచ్చు.
Re: స్లమ్‌డాగ్ మిలియనీర్ నవలకు ఆదరణ
శతబ్లాగోత్సవ శుభాకాంక్షలు.
Re: స్లమ్‌డాగ్ మిలియనీర్ నవలకు ఆదరణ
వ్యాఖ్యలు పంపిన, లోటుపాట్లు తెలపిన అందరికీ ధన్యవాదాలు. దీనిని పోస్ట్ చేశాక మూడు రోజులు సెలవులు, రెండురోజులు పని ఒత్తిడితో బ్లాగ్ జోలికి రాలేదు. తొలి పేరాలో మిత్రుడు సూచించిన తప్పును సరిచేశాను. కూడలి.ఆర్గ్‌లో నా బ్లాగుకు కూడా చోటు ఉందని తెలిసి సంబరపడ్డాను. మొత్తం మీద మనకు తెలియకుండానే ప్రపంచంలో చాలా విషయాలు ఉనికిలో ఉన్నాయని తెలిసింది. అందుకు తాడేపల్లి గారికి నెనర్లు.
నిరాకరణ