Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

భారతీయ కథలను ప్రపంచం వింటోందా...


ఇప్పటికే విదేశాల్లో అద్భుత విజయాలు సాధించి, త్వరలో భారత్‌లో విడుదల కావడానికి సిద్ధమవుతున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం పొందుతున్న ప్రజాదరణ పట్ల ఆ చిత్ర మూల కథా రచయిత వికాస్ స్వరూప్ హర్షం ప్రకటించారు. వికాస్ రాసిన క్యు అండ్ ఎ నవల సినీ రూపమే స్లమ్‌డాక్ మిలియనీర్. తన నవలకు సినిమా రూపం తనను పెద్దగా కదిలించలేదని, అయితే విదేశాల్లో ఈ సినిమా సాధిస్తున్న విజయం చూస్తుంటే ఇది తన కథకు విజయంగా కాక భారత్ విజయంగా, భారతీయ కథ సాధించిన విజయంగా భావిస్తున్నానని దౌత్యవేత్త-రచయిత వికాస్ చెప్పారు.

ఇంతకాలానికి, భారత్ నుంచి వస్తున్న కథలను ప్రపంచం వినడం ఆరంభించిందని వికాస్ చెప్పారు. భారత్ గురించి వినడానికి ప్రపంచం ప్రస్తుతం ఆసక్తి చూపుతున్నట్లు అనిపిస్తోందని అన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో భారతీయ హైకమిషనర్‌గా ఉంటున్న వికాస్ ఇది తన విజయం కాదని. భారత విజయమని చెప్పారు. ఈ కథ వెనుక భారత్ ఉందన్న విషయం మర్చిపోవద్దని అన్నారు.

ముంబైకి చెందిన నిరుపేద కుర్రాడు క్విజ్‌లో లక్షలాది డాలర్లను గెలుపొందిన ఇతివృత్తంతో తను రాసిన కథ మొదటి సారిగా అలహాబాద్‌లో తన మనసుకు తట్టిందట. ఎందుకంటే వికాస్ పుట్టి పెరిగింది అక్కడే మరి. దేశంలోని సగటు ప్రజలకు జీవితంలో ఉన్న అపారమైన అవకాశాల గురించి ఈ కథ తడిమింది. ఇక్కడ ఏదైనా సాధ్యమేనని ఈ కథ చెబుతుంది. ఈ కథలో వ్యక్తమైన ప్రేమ, స్నేహం, విధి అనేవి విశ్వజనీనమైనవని వికాస్ అంటారు.

దౌత్యవేత్తగా ఉంటున్న వికాస్ భారత్ మృదు స్వభావంతో కూడిన శక్తిని ప్రదర్శించడంలో దౌత్యవేత్తలకు సహజసిద్ధమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. హాలీవుడ్‌లో ప్రస్తుతం భారత్ హవా నడుస్తోందని, ఈ పుస్తకం విజయంతో భారతీయ కథలను, భారత్‌లోని చిత్రీకరణ స్థలాలను హాలీవుడ్ మరింత సన్నిహితంగా పరిశీలించే అవకాశముందని అన్నారు.

కాగా, తమలో ఒకడైన వికాస్ రాసిన పుస్తకం ఉన్నట్లుండి అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందడంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సహోద్యోగులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జనవరి మాసాంతంలో భారత్ రానున్న వికాస్‌ను అభినందనల వర్షంలో ముంచెత్తడానికి వీరంతా సమాయత్తమవుతున్నారు.

నిరాకరణ