విజయవంతమైన సాప్ట్‌వేర్ వాణిజ్యవేత్తగా కాక, భారతదేశంలో అతి పెద్ద కార్పొరేట్ గవర్నెన్స్ కుంభకోణపు నిర్మాతగా సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగ రాజు భారతీయ వాణిజ్య చరిత్రలో మిగిలిపోనున్నారు. ఇంతవరకు హైదరాబాద్ నగరం రెండు కీలక విజయాలకు సంకేతంగా నిలుస్తూ వచ్చింది. అవి చార్మినార్, రామలింగరాజు.
ఇవ్వాళ హైదరాబాద్‌కు సైబరాబాద్‌గా గుర్తింపు వచ్చిందంటే సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడే కారణమనేంతగా సత్యం సంస్థ ప్రజల నోళ్లలో నానుతూ వచ్చింది. కాని 20 సంవత్సరాలుగా శ్రమించి పైకి తీసుకువచ్చిన కంపెనీ ఇవ్వాళ కుదేలవటమే కాదు ప్రపంచ సాఫ్ట్‌వేర్ మ్యాప్‌లో సత్యం కంప్యూటర్ సంస్థ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఇలా జరుగుతుందని, వాణిజ్య చరిత్రలో అతి పెద్ద కుంభకోణానికి సత్యం వేదికగా నిలుస్తుందని కాని ఎవరు ఊహించారు? ఎవరు కలగన్నారు? 20 ఏళ్లకు రామలింగరాజు తలచిందేమిటి.. ఇవ్వాల వటవృక్షం కూలిపోయిన తరుణంలో తాను కలగన్నదేమిటి?
విజయవాడ సమీపంలోని భీమవరంలో ఓ వ్యవసాయ కుటుంబంనుంచి వచ్చిన రామలింగరాజు మొదటినుంచి బంగారు పళ్లెంలో తినలేదన్నది వాస్తవం. తండ్రి సత్యనారాయణరాజు కుటుంబ సంపదను కొద్దికొద్దిగా పెంచుతూ వస్తున్న క్రమంలో 1960ల మొదట్లో హైదరాబాద్ వచ్చి వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టారు. నగరంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ రైతుగా తన వృత్తిని కొనసాగించాడాయన.
1970ల మధ్యలో అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసుకుని వచ్చిన కొత్తలో వ్యాపారవేత్తగా ఏదైనా సాధించాలని తాను ఉబలాట పడేవాడినని రాజు ఇటీవలే పత్రికలకు చెప్పారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజిలో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా చేరాలని ఓ స్నేహితుడు చెప్పడంతో తాను అందుకు మొగ్గు చూపానని చెప్పారు. అయితే 1977 చివర్లో ఓ రోజు భోజనం పూర్తయ్యాక తండ్రి తనతో మాట్లాడుతూ, పదిమంది చేతా మంచి అనిపించుకోవడం జీవితంలో చాలా ముఖ్యమైందని, ఎలాంటి చెడు పనులకు దిగరాదని బోధించారు.
క్రమంగా అంతర్జాతీయ కస్టమర్లకు సాఫ్ట్‌వేర్ సేవలను అందించే వ్యాపారంలో ప్రాధమిక స్థాయిలో రాజు మొగ్గు చూపారు. 1987లో మొట్టమొదటిసారిగా సత్యం కంప్యూటర్స్ ఏర్పడింది మొదలుగా అది దిన దిన వృద్ధి చెందుతూన వచ్చింది. షేర్ల అమ్మకం ద్వారా 1992లో నిధుల సేకరణ చేపట్టి బాంబే స్టాక్ ఎక్చేంజ్‌లో లిస్ట్ అయింది.
1994లో డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్‌తో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా సత్యం పెద్ద ముందడుగు వేసింది. తర్వాత దాని పురోగమనంలో ఎలాంటి ఆటంకాలు లేవు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లేదా ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సంస్థనుంచి సత్యం సంస్థను వేరుచేసేది ఏదయినా ఉందా అంటే అది రామలింగరాజే మరి. తన కుటుంబంతో ఉన్నప్పుడు, తన మాతృభాష తెలుగులో మాట్లాడేటప్పుడు రాజు చాలా కులాసాగా, సంతోషంగా కనిపించేవాడని పరిశీలకులు చెబుతున్నారు.
సత్యం ఇన్ఫోవేలో గతంలో పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు ఈ విషయాన్నే మరింత స్పష్టంగా చెప్పారు. రామలింగరాజుకు తన కుటుంబం, కులం తర్వాతే తక్కిన ప్రాధాన్యతలు ఉండేవి. పైగా తన స్వంత భాష తెలుగులో మాట్లాడేవారంటే మరీ అభిమానం. అలాగని రాజు ప్రొఫెషనల్ తత్వం కలిగిన వాడు కాదని తాను చెప్పబోవటం లేదని, అయితే తన వృత్తితో ఇతర విషయాలకు సైతం ఆయన సమాన ప్రాధాన్యత ఇచ్చేవారని ఈ ఉద్యోగి చెప్పారు
ఈ ఉద్యోగి చెప్పిన మాట ఓ మేరకు సత్యమే మరి. రామలింగరాజు సోదరుడు రామరాజు 2000 సంవత్సరం వరకు కంపెనీ ఎండీగా ఉండేవారు. రాజు సొంత మరదలును పెళ్లాడిన చింత్ శ్రీనివాస రాజు సత్యం సంస్థలోని పలు కీలక విభాగాల అధినేతగా ఉండేవారు.
అలాగే సంస్థలోని చాలామంది సీనియర్ మేనేజ్‌మెంట్ నిపుణులు సైతం ఆంధ్రా నుంచే వచ్చారు. ఒక సమయంలో సంస్థలోని కీలక స్థానాల్లో చాలామంది రాజులు ఉండడంతో ఏ రాజు ఎవరు అనే విషయం గుర్తించడానికి తమకు చాలా కష్టమయ్యేదని సీనియర్ పారిశ్రామికవేత్త కూడా చెబుతున్నారు.
మదుపుదార్లను నిలువునా ముంచేసిన ఇంతటి ఉత్పాతంలో సైతం, రాజు పట్ల సానుభూతి చూపేవారు కూడా ఉంటున్నారు. మదుపుదారులు తిరగబడటంతో తన కుమారుల యాజమాన్యంలోని రెండు కంపెనీలను కొనుగోలు చేయాలన్న పథకాలను రాజు వేగంగా రద్దు చేసుకున్నారని మరో కంపెనీ సీఈఓ చెప్పారు.
రామలింగరాజు తన కుమారుల సంస్థలను కొనుగోలు చేయాలనుకోవడం అసాధారణమైన నిర్ణయం అని ప్రముఖ మౌలిక వసతుల సంస్థ ఐపిఆర్‌సిఎల్ ఇండస్ట్రీస్ అండ్ ప్రాజెక్ట్స్ సిఎండి సుధీర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పైగా ఒక్కడితో మొదలైన కంపెనీని 2 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడంతో రామలింగరాజు చేసిన కృషి పాత్రను ఎవరూ మర్చిపోలేరని సుధీర్ అన్నారు.
ఎవరు ఏమంటే మాత్రం ఏం లాభం... దేశంలో నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలిచే వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన రాజు... కంపెనీని అగ్రస్థానంలో నిలపాలనే తాపత్రయంతో మూలాలకు వ్యతిరేకంగా పోవడం ఏ నాటికైనా ప్రమాదకరం అన్న సత్యాన్ని విస్మరించిన సత్యం రాజు... నమ్మిన మదుపుదార్లను నట్టేట ముంచిన కళంకం నుంచి బయటపడగలరా?
అయినా... జనవరి 6 వరకు సత్యంకు ఈ గతిపడుతుందని ఎవరైనా ఊహించారా... చివరకు సంస్థ అధిపతే కనిపించకుండా పోయేంత దారుణ పరిమాణం సంభవిస్తుందని ఎవరు కలగన్నారు మరి..
ఎవరు, ఎప్పుడు, ఎందుకు నమ్మాలి మరి.. ప్రపంచంలో ప్రతిచోటా అందరు మదుపుదారులూ ఇలాంటి అభిప్రాయానికి వస్తే ఏమవుతుందీ ప్రపంచం...?
లోడ్ అవుతోంది...
స్పందనలు