Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

అమ్మాయే చక్కగా మగజీన్సే వేయగా..


ఒకరు వాడుతున్న బట్టలను మరొకరు వాడకూడదని, ఒకరి గిన్నెలో మరొకరు తిండి తినకూడదని, ఒకరి ఎంగిలి గ్లాసు మరొకరు ఉపయోగించకూడదని మనం చిన్నప్పుడు చాలా పాఠాలనే కుటుంబంలో నేర్చుకుని ఉంటాం. కుటుంబంలో సోదరులు అవసరాన్ని బట్టి ఒకరి బట్టలను మరొకరు -అంటే షర్ట్, ప్యాంట్, పంచలు- వాడటానికి ఆర్థిక, తదితర కారణాలు దోహదం చేయవచ్చు.

అయితే క్రేజ్ కోసం ఒకరి బట్టలను మరొకరు వాడినట్లయితే వారెవరై ఉంటారు! దీనికి సమాధానంగా సెలబ్రిటీలు అనే చెప్పాల్సి వస్తుందేమో.. ఓ వైపు పాశ్చాత్య దేశాల్లో మహిళల బ్రాలు, ప్యాంటీలను కాస్త షేపు మార్చి పురుషులకు అనువుగా తయారు చేస్తే ఆబగా కొనుక్కుని మగరాయళ్లు వేసుకుని తృప్తి పొందుతున్న కాలం వచ్చేసింది.

ఇప్పుడు ఇందులోనూ తాము తీసిపోలేదని మహిళా సెలబ్రిటీలు నిరూపిస్తున్నారు. కుర్రకారు జీన్స్‌ చాలా వెరైటీలలో లభ్యమవుతున్నాయని మనందరికీ తెలుసు. తాజాగా బాయ్‌ఫ్రెండ్స్ జీన్స్‌ని అమ్మాయిలు వేసుకుని హ్యాపీగా బయటకు రావడం పశ్చిమదేశాల్లో కొత్త ఫ్యాషన్ అయిపోయింది.

పైగా తాము బాయ్‌ఫ్రెండ్స్ జీన్స్ వేసుకుని తిరుగుతున్నామోచ్ అని బడాయిలు చెప్పుకోవడం కూడా సెలబ్రిటీల సరికొత్త వెరైటీ సంస్కృతిగా మారిందట. హాలీవుడ్ నటి కేటీ హోమ్స్ తన భర్త టామ్ క్రూజ్ వాడే జీన్స్ వేసుకుని ఫోటోలకు తెగ ఫోజిచ్చేస్తోందట. మరోవైపు ఇంగ్లండ్ సాకర్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ భార్య విక్టోరియా సైతం ఇదే దారిలో వెళుతూ భర్త జీన్సులో దర్శనమిస్తోంది.

పిచ్చి ఒకచోట మొదలైతే అది అక్కడే ఉండిపోదని అంటారు పెద్దలు. ఆవిధంగా అది లండన్, అమెరికాలలో మొదలై మొత్తానికి అప్పుడే ముంబై, ఢిల్లీల దాకా వచ్చేసింది మరి. ప్రపంచంలో కొత్త ట్రెండ్‌లను ఆవిష్కరించడమే తరువాయి వాటిని ఫాలో అయిపోవడంలో అమ్మాయిలే ముందు ఉంటున్నారు కదా..

త్వరలో బాలీవుడ్‌లో బిపాస తన ప్రియుడి జాన్ అబ్రహాం జీన్స్‌తో, కరీనా తన ప్రియుడు సైఫ్‌ జీన్స్‌తో కనిపిస్తే మనం పెద్దగా ఆశ్చర్య పడాల్సిన అవసరం ఉండదు. ట్రెండ్‌లు అనే వెర్రి దారులు ఇలానే పెరుగుతూ పోతే అమ్మాయిల బికినీలను, మిడ్డీలను అబ్బాయిలు వేసుకుని తిరిగే కాలం కూడా ఎంతో దూరంలో లేదు మరి..

యువకులకు బ్రాలు యువతులకు జీన్స్...
మనస్తత్వ శాస్త్రం ప్రకారం అసాధారణ ప్రవర్తనలుగా చెప్పబడే అలవాట్లు ఇప్పుడు తాజా ఫ్యాషన్‌గా నిర్వచనం మార్చుకుంటున్నట్లుంది. అబ్బాయిలు బ్రాలు, ప్యాంటీలు ధరించడం, అమ్మాయిలు మగవారి జీన్స్ కోసం వెంపర్లాడటం వంటివి ఈ కోవకు చెందినవే.

నిరాకరణ