వరంగల్‌లో 20రోజుల క్రితం విద్యార్థుల రూపంలోని ఉన్మాదులచేత ఆసిడ్ దాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టలాడుతూ నరకయాతన అనుభవించిన ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థిని స్వప్నిక బుధవారం వేకువ జామున అసువులు బాసింది.
రాజకీయ అర్థంలో ఉగ్రవాదులు కానప్పటికీ, విలువల పరంగా నిజమైన అర్థంలో ఉగ్రవాదులుగా వ్యవహరించి పట్టపగలు రోడ్డుపై టూవీలర్‌పై పోతున్న ఇద్దరు విద్యార్థినులపై యాసిడ్ పోసి పారిపోయిన ముష్కరులు ఈ రోజు భూమ్మీద లేకుండా ఉండవచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన ఆగ్రహావేశాలకు జడిసిన రాజ్యవ్యవస్థ ముగ్గురు నిందితులు పట్టబడ్డ 24 గంటలలోపే వారిని ఎన్‌కౌంటర్ చేసి ప్రజల కోపాన్ని చల్లబర్చి ఉండవచ్చు. ఎన్‌కౌంటర్ పాలయి కూడా ఒక రకంగా వారు సునాయాస మరణమే పొందారని చెప్పాలి.
కానీ ఆ దాడికి గురైన ఇద్దరమ్మాయిల్లో ఒకటైన స్వప్నిక గత మూడు వారాలుగా జీవితంపై పెట్టుకున్న ఆశలు కడతేరిపోయిన స్థితిలో ఒళ్లంతా ఆసిడ్ గాయాలతో నరక యాతన అనుభవించి, ఈ అవాంఛిత బాధలు ఇక చాలంటూ వెళ్లిపోయింది.
విద్యాసంస్థలు, చట్టాలు, రాజకీయాలు, నేతలు ఇలా అన్ని వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయిన స్వప్నిక ఒళ్లంతా ఆసిడ్ ప్రభావంతో కరిగిపోయిన దయనీయ పరిస్థితిలో మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన మరణ వాజ్ఞూలంలో ఒకే ఒక్క కోరిక కోరుకుంది. తనకు కల్గిన దుస్థితి ఇక ఏ అమ్మాయికీ కలగకూడదని అర్థించింది.
ఎన్ని వందలసార్లు ర్యాగింగుల పేరిట, ప్రేమ పేరిట, ఇష్టం పేరిట అమ్మాయిలను వేధిస్తూ వారి ఊపిర్లు తీసుకుంటున్నా చలించని రాజ్య యంత్రాంగం స్వప్నిక చివరి కోరికను మెరుపువేగంతో పట్టించుకుంది. ప్రజల దృష్టిలో తమ పరువు పూర్తిగా పోయిందని అర్థమైన రాజకీయం ఇచ్చిన అనుమతి దన్నుతో, పట్టుబడిన 24 గంటల్లోపే వరంగల్ గుట్టల్లో నిందితులను గన్‌కౌంటర్ చేసిన పోలీస్ యంత్రాంగం ప్రజల నీరాజనాలను కూడా అంతే వేగంగా అందుకుంది.
స్వప్నిక, ప్రణీతలకు పట్టిన గతి మరే అమ్మాయిలకూ పట్టకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత వేగంగా అత్యంత కఠిన చర్యకు రాజ్యం పాల్పడి భుజాలు చరుచుకుంది కానీ... స్వప్నిక కోరుకున్న వేధింపు రహిత పరిస్థితి మన కళ్లముందు నెలకొంటుందా.. ఈ రకమైన గన్‌కౌంటర్ పరిష్కాలతో ఇది సాధ్యమవుతుందా అనే ఆలోచనలు పలువురిలో కలుగుతున్నాయి.
ఇదంతా ఒకెత్తు కాని ఆసుపత్రిలో జీవితం మీద కొండంత ఆశతో ఆసిడ్ గాయాలను పంటిబిగువను భరిస్తూ మూడు వారాలుగా నరక యాతన అనుభవించిన స్వప్నిక బాధలను, వేదనను ఎవరైనా మర్చిపోగలరా.. మర్చిపోలేరనే వైద్యులు చెబుతున్నారు.
దాదాపు 55 శాతం శరీరం ఆసిడ్ గాయాలకు గురైనప్పటికీ చివరి రోజువరకు మొక్కవోని ధైర్యంతో స్వప్నిక చివరి పోరాటాన్ని సాగించిందని, గాయాల బాధను ఓర్చుకోవడంలో ఆమె స్పూర్తి దాయకంగా వ్యవహరించిందని యశోదా హాస్పిటల్ మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ సుందరరావు చెప్పారు.
మనిషి భౌతికంగా లేకుండా పోవచ్చు. కాని వారి ఆశలు, ఆరాటాలు, ఆవేదనలు, అంతిమ వాంఛలు అదృశ్యం కాలేవని సమస్త ఫిలాసఫీలు నొక్కి చెబుతున్నాయి.. ఇకపై ఏ ఆడదానికి నా గతి పట్టకూడదు... స్వప్నిక శ్వాసించిన ఈ చివరి కోరిక మాటేమిటి.. మన సమాజం దీనికి జవాబివ్వగలదా?
స్వప్నలు, ప్రణీతలు, భార్గవిలు, ప్రత్యూషలు, ఆయేషాలు, రాధమ్మలు, శ్రీలక్ష్ములు... ఒకరా.. ఇద్దరా.. ముగ్గురా.. వేలమంది... నవ యువతులు తమ భవిష్యత్తు కోసం ఉంచుకున్న గంపెడాశలు మనిషికే... మగాడికే... సాధ్యమైన మహా స్వార్థం బారినపడి నలిగి పోతున్న సంస్కృతీ రహిత సమాజంలో వీరి ధన మాన ప్రాణాలకు రక్షణ ఆశించడమే ఎండమావికోసం ఆరాటపడినట్లవుతుందేమో..
పాతకాలంలో కవి అన్నట్లు కలకంఠి కంట కన్నీరొలికిన నాటి రోజులు కావివి... కలకంఠి కంట మగాడి స్వార్థమనే ఆసిడ్ ఒలుకుతున్న కాలం.. నాకు దక్కకపోతే మరెవరికీ దక్కకూడదు అనే వ్యక్తిగత ఆస్తి భావన పునాదిలోంచి... ఇంటి మచ్చిక జంతువులను, స్త్రీలను, భూములను, బ్యాంకు బ్యాలెన్స్‌లను ఒక గాటిన కట్టి చూస్తున్న వ్యవస్థాగత ప్రయివేట్ ధర్మం రాజ్యమేలుతున్నంత కాలం స్త్రీల మనుగడ నిత్యం ఆసిడ్ పాలవుతూనే ఉంటుంది.
లోడ్ అవుతోంది...
స్పందనలు