మొన్న మా సహోద్యోగి జుత్తు కొంచెం కొంచెం పైకి పోతోంది అనే అంశంపై 'జుట్టంటూ ఒకటి ఉంటే...' అనే చిన్న కథనం రాసి ఈ బ్లాగ్‌లోనే పోస్ట్ చేస్తే విభిన్న వ్యాఖ్యలు వచ్చాయి. జుట్టు ఊడిపోతున్న వారి బాధలను తెలియజేసే క్రమంలో వారి మనోభావాలను గాయపర్చారని మా సహోద్యోగి రాస్తే అమెరికానుంచి రమణ అనే ఒక బ్లాగరి ఇంకోలా రాశారు.
"నిజానికి జుట్టంటూ వుంటేనే రంగువేసే బాధైనా కత్తిరించాల్సిన కష్టమైనాను. నాకు ముఫ్ఫైరాకుండానే మూడొంతులూ ఊడిపోయింది. ఇప్పుడు అమెరికాలో చాలామందిలాగే హాయిగా వారానికి ఒకసారి 'నెంబర్ వన్ ఆల్ ది వే' చేసేస్తున్నా. మనవాళ్ళు 'బోడిగుండు భోగం' ఎందుకన్నారో బాగా అనుభవంలోకి వచ్చింది." అంటూ ఆ బ్లాగరి తన అనుభవాన్ని వ్యాఖ్యగా పంపారు.
ఈ రెండు వ్యాఖ్యలను చదివిన తర్వాత మరో వార్త వచ్చింది. న్యూజిలాండ్ జాతీయ ఎయిర్ లైన్స్ వారు బట్టతల ఉన్నవారికి ప్రత్యేక ఆఫర్ ఇచ్చారట. బట్టతలపై ప్రకటనలు పెయింట్ చేస్తామని, అలా ప్రకటనలు పెయింట్ చేసుకుని ప్రధానమైన ఎయిర్‌పోర్టు క్యూలలో నిలబడితే వారికి రూ. 30 వేల వరకు నజరానా ఇస్తామని వారు ప్రకటించారు. బట్టతల వెనకాల టాటూస్ వేస్తే వెనక నిలబడిన ప్రయాణీకులకు కూడా తమ ప్రకటనలు కనపడి సమీపంలోంచే వాటిని చూడగలరని ఎయిర్ లైన్స్ వారి ఆలోచన...
ఇదే విషయాన్ని మా సహోద్యోగి వద్ద తడిమాను. జుత్తు కొంచెం కొంచెగా పైకి పోతోందని బాధ పడవద్దు... సగం బట్టతల ఉన్నవారికి కూడా పూర్తిగా తల గొరిగించి మరీ వారి బట్టతలలను ప్రకటనలకోసం వాడుకునే రకం ప్రపంచంలో మనం ఉన్నాం.. కాబట్టి జుత్తు మాయమవుతోందని భయపడవద్దు. మనకూ, మన బట్టతలకూ కూడా అవకాశాలు ఉన్నాయి.. ఇంకా ఇలాంటివి ఎన్నో వస్తాయి అని ఊరడించాను..
అప్పుడు మా సహోద్యోగి విరిచిన విరుపుకు నా నోట మాటరాలేదు మరి.. బట్టతల వచ్చింది కాబట్టి అవకాశాలు రావడం కాదండీ... ఈ చిన్న జీవితంలో ఎన్నో అవకాశాలు ఇప్పటికే వచ్చి వచ్చి ఇలా బట్టతల వచ్చేస్తోంది మరి. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి.. అంటూ నవ్వాడు.
"అవకాశాలు వచ్చాయి కాబట్టే బట్టతల.. అంతే కానీ బట్టతల వచ్చింది కాబట్టి అవకాశాలు రాలేదు..."
ఎంత తాత్వికత దాగి ఉంది ఈ తరం ఆవేదనలో.... కాలేజీనుంచి బయటపడిన క్షణాలనుంచే పెను ఒత్తిళ్లకు లోనవుతున్న నేటి తరం చిన్ని జీవితమే బట్టతల పాలవుతోంది మరి...
జుట్టంటూ ఒకటి ఉంటే... అనే వెనుకటి కథనం చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
లోడ్ అవుతోంది...
స్పందనలు