ఈ రోజు ఆఫీసుకు వస్తూనే జుట్టు మీదికి చర్చ మళ్లింది. అంతవరకు అక్కడక్కడా నెరిసిన జుత్తుకు వయసు మళ్లిన వారు కాస్త రంగు దట్టించి మరీ ఆఫీసుకు వస్తే ఎవరికయినా తొలి రోజు కాస్త ఆశ్చర్యమేస్తుంది కదా... మరుసటి దినం నుంచి అలవాటయిపోతుంది కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోరు మరి.
కాని ఇలా జుట్టుకు రంగు వేసుకుంటే కూడా కొందరికి మరో రకం బాధ వేస్తుందని ఈ రోజే తెలిసింది. నెల రోజుల తర్వాత జుత్తుకు మళ్లీ మరమ్మతులు చేసుకుని ఆఫీస్‌కు ఉదయం ఇలా ఎంటరయ్యానో లేదో.. అప్పటికే వచ్చి ఉన్న మా సహచరుడు కళ్లు ఎగరేసి తలాడించాడు. ఆ కళ్లు ఎగరేయడం, తలాడించడంలోనే అర్థం అయిపోయింది. మనవాడికి మన రంగు విషయం తెలిసిపోయిందని..
నేనూ తలాడించి నవ్వాను... ఏదో ఒక కామెంట్ వస్తుందనుకున్నాను. అందరి మధ్యా కాస్తంత చర్చ జరిగిన తర్వాత సహజంగానే ఒక విషాదచ్ఛాయ ముఖబింబంలో ప్రదర్శిస్తూ ఇలా అన్నాడు... ఒకింత దీనంగా ముఖం పెట్టి..
"...జుట్టంటూ ఉంటే మనుషులు ఏదో ఒకటి చేసుకోవచ్చు. అసలు జుట్టే లేకుండా పోతుంటే ఏం చేసుకోవాలి..."
అసలు విషయం ఏమిటంటే జుట్టు కొంచెంగా కొంచెంగా పైకి పోతూ ఉండేది తనకే మరి...
కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అయితే ప్రపంచం బాధ శ్రీశ్రీకి బాధ అయిందని నానుడి.
మరి మా సహచరుడు ఏ కోవకు వస్తారు మరి...
నిజమే... జుట్టంటూ ఉంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు.. అసలుకే మోసం వస్తూంటే... ఎవరయినా ఏం చేస్తారు మరి.....
పాపం...!....
లోడ్ అవుతోంది...
స్పందనలు