ఒకే రాష్ట్రంలో పుట్టి కూడా ప్రాంతాలకు సంబంధించిన అభిజాత్యాలు, ఔద్ధత్యాలు ఎందుకు వస్తాయి అనే ప్రశ్న సంధించడం చాలా సులభమే కాని దాని చిక్కుముడి విప్పటం మాత్రం మానవమాత్రులకు సాధ్యం కాదు.. అసలే మన రాష్ట్రం ఇప్పుడు పత్యేక తెలంగాణా, ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక రాయలసీమ వాదాలు ప్రతివాదాలతో దద్దరిల్లుతోంది మరి.
మా చెన్నై పోర్టల్ ఆఫీసులోనూ రాయలసీమ కోస్తా జిల్లాలకు సంబంధించిన తెలుగువాళ్లు పనిచేస్తుంటారు. పని ఒత్తిడిలో ఉంటున్నప్పుడు కాస్త రిలీఫ్ కోసం అలా టీ, కాఫీలకు వెళ్లినప్పుడో లేదా చిన్న విషయం ప్రస్తావనకు వస్తే వెంటనే సమస్త లోక వ్యవహారంబులపై చర్చోపచర్చల యుద్ధారావాలు చేస్తూండటం కొంత కాలంగా సహజమైపోయింది.
ఎప్పుడు చర్చలు కొనసాగినా వెంటనే అవి ఆయా ప్రాంతాల జీవన శైలి, ప్రాదేశిక స్వరూపాల మీద కూడా చర్చలకు అవకాశమిస్తూంటాయి. సాధారణ సంభాషణలే... కాని లోతుగా పోతే ఇక్కడే రెండు ప్రాంతాలు కొట్టుకుని విడిపోతాయా అనేంత తీవ్రస్థాయిలో జరుగుతుంటాయి,
ఈ సందర్భంగా రాయలసీమ వాళ్లను కోస్తా వాళ్లు గేలి చేయడం కోస్తావాళ్లను రాయలసీమ వాళ్లు ఏడిపించడం రెండూ జరుగుతుంటాయి. ఈ చర్చలకు ఒక ప్రాతిపదిక అంటూ ఉండవు. మనసులోకి ఆ క్షణంలో ఏది వస్తే అది వెంటనే వాదులాటగా మారిపోవటం. మీది గొప్పా మాది గొప్పా మీరు గొప్పా మేము గొప్పా అనే రకం చర్చలకు ప్రాతిపదిక ఏమి ఉంటుంది మరి.
ఉదాహరణకు కోస్తా అభివృద్ధి చెందిన ప్రాంతం కదా అన్నీ అక్కడే ఉన్నాయి కదా.. అన్నీ అక్కడే పుట్టి పెరిగాయి కదా.. జాతికి సేద్యం నేర్పింది మేమే కదా, అన్ని రాష్టాల్లో వ్యవసాయం, మైనింగ్, రియల్ ఎస్టేట్, నిర్మాణ పనులు మావే కదా అనే వాదనలు వచ్చాయనుకోండి. ఇక అంతే..
వెనుకబడిన ప్రాంతమైన రాయల సీమ వాళ్లు తక్కువ తినరు.. మీ గొప్పలూ మీ ఘనతలూ మా చంద్రబాబు ముందూ, మా వైఎస్ఆర్ ముందూ దిగదుడుపే అంటూ ముఖ్యమంత్రుల మీదకే చర్చ మళ్లిస్తారు. అంత మహా చరిష్మా కలిగిన ఎన్టీరామారావుకే కాలికింది కుర్చీ లాగి దిమ్మతిరిగించిన బాబుగారు మావాడే అంటూ మొదలెడతారు.
ఇంకా పోతే వైఎస్‌తో ఎన్న తగిన నాయక శిరోమణి కోస్తాలో కంచుకాగడా పెట్టి వెదికినా దొరుకుతాడా అని రెచ్చగొడతారు. మీ కోస్తాకు, మీ మేధస్సులకు మా ప్రాంతం ముఖ్యమంత్రులే కావలసి వచ్చారు మరి అంటూ వెక్కిరిస్తారు.
అసలు మా తిరుపతి వెంకన్నతో సరిసమాన దేవుడు కాని మా వరదయ్యపాలెంలో తిష్టవేసిన వన్‌నెస్ టెంపుల్ ఇలవేల్పు ఆ కలియుగ దైవం కల్కితో సరిపోలే అవతారమూర్తులు మీ కోస్తాలో దొరుకుతారా అని గేలి చేస్తారు..
ఇలాంటి లక్షోప లక్షల చర్చల్లో ఒక చర్చ పైన చెప్పినట్లుగా మెట్ట రాయలసీమ మీదికి క్లాసికల్ కోస్తా మీదికి మళ్లింది. కోస్తాకు చెందిన మా సహోద్యోగి.. చర్చ మొదలెడుతూ.. ఆ మీ రాయలసీమ అంతా మెట్టే కదా మెట్ట పంటలు తప్ప మీ వద్ద ఏమున్నాయి.. అదే మా కోస్తా చూడండి. ప్రాజెక్టులు మావే.. మహానదులు మావే.. ధాన్య రాశులు మావే... అంతా మాదే.. అందుకే మాది క్లాసికల్ కోస్తా అని ఉబ్బేసుకున్నాడు..
ఇవతల పక్షం తక్కువే తినలేదు.... '...అవును అంతా క్లాసిక్కే.. మీ ప్రాజెక్టులూ మహానదులూ ధాన్యరాశులూ మాత్రమేనా నీ జుత్తు కూడా క్లాసిక్కేనబ్బా అంటూ జోకులేశారు. పాపం ఆ కోస్తా మిత్రుడికి చిన్నవయసులోనే నుదుటి మీద జుత్తు కాస్తా కొంచెం కొంచెంగా పైకి పోతోంది. ఇంత క్లాసికల్ మేమెక్కడా చూడంలే'.. అని సీమ వాసుల్లో ఒకరు జోకేస్తే నవ్వులే నవ్వులు..
ఇవి సరదాగా తీసుకున్నంత వరకు మాత్రమే బాగుంటాయి. అవతలి పక్షం ఏ మాత్రం దాన్ని సీరియస్‌గా తీసుకుందంటే రామ రావణ యుద్ధం ఇక్కడే మొదలవుతుంది మరి. అయితే ఇంతవరకూ ఇరుపక్షాలూ సరదా పరిధులను దాటలేదు కాబట్టే ఇక్కడ మా ఆఫీసులో వేర్పాటు వాదం పుట్టలేదు.
మెట్ట రాయలసీమ... క్లాసికల్ కోస్తా...
నిజమే....
లోడ్ అవుతోంది...
స్పందనలు