క్లాస్ రూములో టీచర్లు, లెక్చరర్లు పాఠం చెబుతుంటే ఒదిగి కూర్చుని వినే రోజులు పోయాయి. తెలుగు సినిమాలు దఫదఫాలుగా స్టూడెంట్ టీచర్ సంబంధాలలోని అల్లరిని, వికృతస్థాయిలో ప్రదర్శిస్తున్నారంటే వాటికి భూమిక మన నిజమైన కాలేజీలలో ఇప్పటికే తయారైపోయింది మరి.
పైగా మన విద్యావిధానం గురించి చెప్ప పని లేదు.. అన్ని సెక్షన్ల విద్యార్థులను ఒకటే గదిలో కుప్పపోసి వందమందికి రెండువందల మందికి ఒకే క్లాసులో టీచర్లు పాఠాలు చెప్పే పరిస్థితి ఇంకా ఉంటున్న నేపథ్యంలో ఏ కొంటె కోణంగో సరదాగా జోకులు, అతి జోకులు వేసినా ఆ జోకుల మూలకర్తను గుర్తించే సామర్థ్యం టీచరుకు అసలే ఉండదు.
రెండు వందలమంది కూర్చున్న క్లాసులో జోక్ ఏ మూల నుంచి వచ్చింది అనే విషయం సౌండ్ ద్వారా మాత్రమే కనుగొనగలరు. ఇది స్టూడెంట్లకు మరీ అనుకూలత. అందులోనూ రొడ్డకొట్టుడు పద్ధతిలో అదే క్లాసు, అదే టీచరు, అదే పిల్లలు, వీటన్నిటికీ మించి అవే పాఠాలు సంవత్సరాల తరబడి ఇలాగే కొనసాగే మహ దొడ్డ విద్యావిధానంలో ఎవరికీ ఏకధ్యాసతో పాఠాలు వినే ఓపికా, ఏకాగ్రతా కూడా ఉండవు మరి.
అందుకే ఎవర్నీ ఎమీ అనలేని పరిస్థితే మన దేశంలో చాలా విషయాల్లో రాజ్యమేలుతుంటుంది. చదువు చట్టుబండల విషయంలోనూ ఈ తీరే సాగుతూంటుంది.
ఈ పొడవాటి ఉపోద్ఘాతానికి కారణం ఉంది మరి.. పని ఒత్తిడి నుంచి కాసింత తెరపిన పడటానికి టీ, కాఫీలకు ఆఫీసులోనే ఏర్పాటు చేసిన అర లోకి పోయినప్పుడు సహోద్యోగులలో ఎవరో ఒకరు జీవితానికి సంబంధించిన అనుభవాల జోకులను పేలుస్తూనే ఉంటారు.
ప్రస్తుత సందర్భంలో ఒక సహోద్యోగి ఒకరోజు పేల్చిన జోకే ఇవాల్టి బ్లాగంశంగా మారింది మరి.
ఏంలేదు.. తను బిఇడి చదివేటప్పుడు జరిగిన సంఘటన. ఎప్పటిలాగో వంద రెండు వందల మంది విద్యార్థులను కలిపి తెలుగు క్లాసురూంలో కుక్కారు. వీళ్లకు తెలుగు టీచర్.. అందరికీ కలిపి పాఠం చెప్పాలి.. అందులోనూ ఇవి మా రోజులు కావు. టీచర్లు పాఠం చెప్పేతీరును, వాడే అలవోక పదాలను అట్టే పట్టేసుకుని జోకులు మీద జోకులు అలాగే అల్లుకుని నవ్వుకునే తరం రోజులు...
ఇదే విధంగా ఆరోజు కూడా ఆయన క్లాసుకు వచ్చారట. వస్తూనే దేవుల పల్లి కృష్ణశాస్త్రి సుప్రసిద్ధ పద్యం ఎత్తుకున్నారు. దానిలో చివరిపాదం నవ్విపోదురు గాక.. అని ఆయన ముగిస్తుండగానే క్లాస్ దద్దరిల్లిపోయింది.. 'నీకేటి సిగ్గు' అంటూ... అంతే... దాంతో ఆయన అగ్గిమీద గుగ్గిలమైపోయారు.
'... ఎవడ్రా.. ఎవడ్రా వాడు... ధైర్యముంటే లేచి నిలబడండ్రా'... అంటూ మొత్తుకున్నారు. ఊహూ. మనవాళ్లు లేస్తే కదా... కనీసం పక్కకు కూడా కదలరు. అనవలసింది అనేసి శిలావిగ్రహాలుగా కూర్చోడంలో మనదే గోల్డ్ మెడల్ మరి.. దీంతో ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి అలిసిపోయారు. ఒక్క నాయాలు కూడా ఈ క్లాసు దాటి బయటకు పోలేర్రా.. వెధవలు నీ కేటి సిగ్గు అంటారా.. మీకు రావు రోయ్.. చదువులూ రావు.. ఉద్యోగాలు రావూ.. అంటూ తిట్టినంత సేపు తిట్టి ఆయాసపడి క్లాస్ లోంచి వెళ్లిపోయారు..
విషయమేమిటంటే... భావ కవిత్వాన్ని వరించి పలవరించిన దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఎవరేమనుకున్నా నా కవిత్వ మార్గాన్ని వదలనని చెప్పిన సందర్భంగా ఈ పద్యం రాసినట్లుగా ప్రతీతి. ఆయన నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు.. అని రాస్తే ఈ కొంటె కోణంగులు దాన్ని నవ్విపోదురు గాక నీకేటి సిగ్గు అని తిరగేసి పాడి అయ్యవారికి నసాళానికి అంటించారు...
లోడ్ అవుతోంది...
స్పందనలు