Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

వీళ్లా.. వెళ్లనీయరు నేనా.. వెళ్లలేను!


చదివే చదువుకు చేసే ఉద్యోగాలకు మన దేశంలో, మన విద్యావిధానంలో ఏ మాత్రం పొంతన లేదని ఇప్పుడు ఎవరూ ఎవరికీ విడమర్చి చెప్పాల్సిన పని లేదనుకుంటా... ఎందుకు చదువుతారో, ఏం చదువుతారో, ఏ ఉద్యోగాలు సంపాదిస్తారో, చివరకు ఎలా జీవిత చరమాంకాన్ని ముగిస్తారో మన దేశంలో చాలా మందికి తెలీకుండానే అలా జరిగిపోతూ ఉంటుంది.

ఎందుకంటే చదివిన చదువుకు తగిన ఉద్యోగం దొరకదు. ఫలానా పని నాకిష్టం... ఇదయితే చేయగలను.. అని ఎంతగా మొత్తుకున్నా, గీపెట్టినా నీ మాటా నా మాటా మన మాటా వినేవారు ఎవ్వరూ లేరిక్కడ. కాబట్టి మొదట్నుంచి మన కోసం మనం చదవటం కాకుండా ఎవరో చెప్పినట్లు, ఎవరో కోరుకున్నట్లు, ఎవరో డిమాండ్ సృష్టిస్తే దానికి స్పందించినట్లు మనం చదివి పారేస్తుంటాం..

ఏ రంగంలో అయినా కానివ్వండి నాకు నచ్చిన చదువు, నేను మెచ్చిన ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పేవారి సంఖ్య భారత దేశంలో చాలా తక్కువే ఉంటుంది. మార్కులకోసం, పట్టాల కోసం, మార్కెట్ అవసరాలకోసం చదివేస్తున్న చదువులు కాబట్టి ఇక్కడ ఎవరి కోరికలకూ ప్రాధాన్యం లేదు.

ఫలానా కోర్సుకు మంచి భవిష్యత్తు ఉందని ఎవరో చెబితే గుంపులో గోవిందా అనే రకంగా ఏ ఎంబిఏలో, ఎంసీఏలో, ఐటీకోర్సులో జాయిన్ అయిపోయి పట్టా సాధించి చివరకు చదివిన రంగంలో జీవితం సాగించడం కాక ఉద్వేగాన్వేషణలో ఏదో ఒకటి దొరికితే చాలు అనే పరిస్థితిలోకి కొట్టుకుపోయి దొరికిన దానిలో చేరడం, చేరాక మళ్లీ మథనపడుతుండటం... అటూ ఇటూ కదల్లేక ఎక్కడున్నావు గొంగళీ అంటే వేసినచోటనే ఉన్నా అనే చందాన గిరికీలు కొడుతుండటం చూస్తూనే ఉన్నాం.

ఇవన్నీ నాకు, మీకు, మనందరికీ తరాలతో పనిలేకుండా జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే అనుభవాలే అనుకోండి. ఈ దేశంలో లక్షలాది మంది విద్యార్థులు, కొత్తగా ఉద్యోగాలలో చేరినవారు ఇలాగే వాపోతుంటారనడం అతిశయోక్తి కాదు. చదివిన రంగంలోనే ఉద్యోగాలు దొరకటం గగనమయిన నేపథ్యంలో దేంట్లోనో ఒక దాంట్లో చేరిపోయి కొన్నాళ్లకు, కొన్నేళ్లకు మనం ఆశించిన, ఊహించిన రంగంలో ఉద్యోగాలు దొరక్క, సంబంధిత ఆఫీసుల మెట్లుకూడా ఎక్కే అర్హత కోల్పోయి ఎందుకిలా మారింది జీవితం అనుకునే వారెందరో మనలో..

సరిగ్గా ఈ సందిగ్ధ అసందిగ్ధ మహా మానసిక సంక్షోభాన్ని మా మిత్రుడు ఈ మధ్యే అద్భుతమైన మాటలతో పేల్చాడు. తనేమో ఐటీ ఫీల్డ్‌కు తగిన కోర్సు పూర్తి చేశాడు. నాలుగేళ్లకు ముందు ప్రస్తుతం బాగా డిమాండ్‌లో ఉన్న ఎం.... కోర్సుల్లో ఒకదాన్ని పూర్తి చేశాడు. అనుభవం లేమితో కంపెనీల మెట్లు ఎక్కీ, దిగినా సంబంధిత రంగంలో ఉద్యోగం పొందలేక, ఇంటిలో, సమాజంలో ఒత్తిళ్లను తట్టుకోలేక ఏదైతేనేమి అంటూ ఒక రాయిని ఒక సెమీ ఐటి ఆఫీసులో వేశాడు.

అంతే,, కాస్త టెక్నకల్ బ్రెయిన్ ఉన్నవారు దొరికితే చాలు లోకలైజేషన్ కోసం గాను వచ్చి పడుతున్న ప్రాజెక్టులకు సహాయకారులుగా ఉంటారు అనే ఉద్దేశంతో ఎదురుచూస్తున్న కంపెనీకి లడ్డు దొరికినట్లయింది. తక్కువ జీతంతోనే అనుకోండి వెంటనే చిన్నపాటి టెస్టు పెట్టి చేర్చేసుకున్నారు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి. నెలలు నెమ్మదిగా సంవత్సరాలకు మరలాయి.

పాపం మనవాడు అటూ గెంతెయ్యలేడు. ఇటూ కుదురుగా ఉండి ఇంతేరా మన జీవితమూ చందాన సర్దుకు పోనూలేడు.. కాస్తో కూస్తో టెక్నికల్ బ్రెయిన్ కాబట్టి అందులోనూ తక్కువ జీతంతోనే వచ్చాడు కాబట్టి కంపెనీ కూడా తనను వదులుకోలేదు. ఎన్నిసార్లు తిరిగినా, ప్రయత్నించినా అందరూ అనుభవం గురించి అడిగేవారే తప్ప రారమ్మని తనను పిల్చి పీఠమెక్కించేవారు బయట లేరు. పైగా ఇన్నేళ్లుగా టెక్నికల్ కోర్సు చేసి కూడా ట్రాన్స్‌లేషన్, లోకలైజేషన్ రంగంలో పనిచేసినందున ఈ అనుభవం ఆ తరహా ఉద్యోగాలకు ఏ మాత్రం పనికిరాదు.

ఈ ఉద్యోగంలో చేరి చాలా పొరపాటు చేశానని ఎన్నోసార్లు తలుచుకుంటాడు. వాపోతాడు.. దాదాపు మూడు నాలుగేళ్లు అయిపోయింది కాబట్టి ఇక తను చదివిన రంగంలో ఇక ఛాన్స్ ఉండదని మథనపడతాడు. బయటే ఉండి ఏదో ఒక అదనపు కోర్సులను పూర్తి చేసి అటే పోవలసింది అని వాపోతాడు. అలాగని ఉద్యోగం పూర్తిగా మానేసి మళ్లీ ఏదో ఒక ఎక్స్‌ట్రా కోర్సు చదివేసి అదృష్ట దేవతను పరీక్షించుకుంటే పోలా అనే సాహసం కలికానిక్కూడా చేయలేడు. ఎందుకంటే ఉన్నది కూడా పోతే తర్వాత పరిస్థితి ఏమిటి అనేది పర్వతంలా ఎదురు నిలబడుతుంటుంది.

అయినా మనసు ఊరుకోదు. మనసంటేనే చంచలం కదా.. అటా ఇటా ఎటూ అని వాపోతూనే ఉంటుంది. ఇటు మనవాడి ఆలోచనలు తనవి అయితే కంపెనీ ఆలోచనలు కంపెనీవి. ఎవరి అవసరాలు వారికి ముఖ్యంకదా.. జీతం తక్కువ... పైగా టెక్నికల్ బ్రెయిన్ కాబట్టి అటు కంపెనీ కూడా ఇతడిని వదులుకోలేదు... అలాగని ఎన్నాళ్లీ సాఫ్ట్‌వేర్‌ల అనువాదపు బతుకు అనుకుంటూ ఏదో ఒక క్షణాన తెగించి... ముందుకు అడుగెయ్యాలంటే దానికీ గుండెకాయలుండవు.. ఎందుకంటే ఉన్నది కాస్తా పోయిందీ.. సర్వ మంగళం ఆయింది అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో పాత సినిమా పాట వీనులవిందుగా వినబడుతూ ఉంటుంది.

ఇలాంటి అనుభవం ఒకసారి ఇప్పటికే ఎదురై తల కాస్త బొప్పి కట్టింది కూడా... కంపెనీ హెడ్‌క్వార్టర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌లో ఏదైనా అవకాశం వస్తే అటే పోదాం అని బాగా ఆశిస్తూంటాడు. ఎందుకిలా పదే పదే జీవితంలో సెటిల్ కాలేదని బాధపడతావు.. మంచి జీవితం కావాలి అని కోరుకుంటున్నప్పుడు తెగించి బయటకు వెళ్లి పరుగుపందెంలో పాల్గొనకపోయావా అని కాస్త సానుభూతిగానే అడిగాను ఈ మధ్య..

ఇలా తక్కువ జీతాలకు దొరికిన వారిని వదులుకోని కంపెనీ వైఖరిని, అలాగని తనకు దొరికిన దానితో సంతృప్తి పడలేని ఉద్యోగ మనస్తత్వాన్ని అద్దంలో చూపించేటటువంటి గొప్ప తాత్విక వ్యాఖ్యను ఈ సందర్భంలో జోడించాడిలా...

వీళ్లా... వెళ్లనీయరు... నేనా... వెళ్లలేను.... ప్చ్.....

మిత్రమా! ఆల్‌ ది బెస్ట్@యువర్ విష్......!

స్పందనలు

Re: వీళ్లా.. వెళ్లనీయరు నేనా.. వెళ్లలేను!
అద్దంలో కొండ అలాగే కనిపిస్తుంది. దగ్గరకెళ్తేగానీ తెలియదు...
Re: వీళ్లా.. వెళ్లనీయరు నేనా.. వెళ్లలేను!
Even the impossible says i'm possible. There are ample other people who shifted from non-technical background to technical back ground. Otherwise, IBM has one option. Non technical people can move to technical side after doing few certifications and fulfulling the required criteria. Ask your frined to be prepared in basics in what he is doing. Let him understand what industry expects, then he can join his dream job.
Re: వీళ్లా.. వెళ్లనీయరు నేనా.. వెళ్లలేను!
చాలా బాగుంది సార్
నిరాకరణ