Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

దేవుడికి క్రెడిట్ కార్డు ఎందుకు ఉండదు?
















మా పోర్టల్ ఆఫీసులో మధ్యాహ్నం భోజన వేళలో నిత్యం జోకులు, చెణుకులు, మాటల సయ్యాటలు పేలుతుంటాయి. కుర్రాళ్లు, అందులోనూ బ్రహ్మచారులు, ఐటీ, సెమీ ఐటి వేగజీవితంలో ట్రబుల్ షూటింగ్‌ కోసం అతివేగంగా స్పందించే యువకులు ఉన్న వాతావరణంలో జీవితంలో ప్రతిదీ జోకుల బాట పట్టుతుంది.

నిజం చెప్పాలంటే జోకుల గురించి తెలుసుకోవాలన్నా, స్వంతంగా జోకులు రాసి పోర్టల్‌లో పెట్టాలన్నా ఇప్పటికే ప్రింట్ అయిన జోకు పుస్తకాలను తెరచి చూడాల్సిన పనిలేదు. అలవోకగా యువతరం విసిరే మాటల తూటాలను, విరుపులను, శ్లేషలను మనం పట్టుకున్నామంటే చాలు... ఆ పూటకు జోకు తయారైపోతుంది.

మొన్నటికి మొన్న మధ్నాహ్నం భోంచేస్తుండగా మా తెలుగు లోకలైజేషన్ - సాఫ్ట్‌వేర్, ఐటి ఉత్పత్తుల స్థానికీకరణ- విభాగంలో సహోద్యోగి హర్ష ఉన్నట్లుండి ఒక ప్రశ్న సంధించాడు. మా సంభాషణ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై చర్చకు మళ్లింది. తింటూ వింటూ హర్ష ఉన్నట్లుండి అడిగాడు.. "అవునూ.. బ్యాంకోళ్లు దేవుడికి ఎందుకు క్రెడిట్ కార్డు ఇవ్వరు...." అంటూ బాణం సంధించాడు.

దేవుడికి క్రెడిట్‌ కార్డా.. అంటూ ఇంత అధునాతన భావాన్ని మాలో మేము జీర్ణించుకుంటూ ఉండగానే వేణు తనకే స్వంతమైన విరుపుతో ముందుకు దూకేశాడు.. "అడ్రస్ ప్రూఫ్ ఉండదు కదా అందుకని ఇవ్వరు మరి...." అనేశాడు. ప్రశ్నకు తను మెరుపు వేగంతో స్పందించిన తీరుకు ఫకాలున నవ్వేశాం..

నిజమే మరి సర్వాంతర్యామి.. సర్వము తానెయైన వాడు, ఎందెందు వెదికిన అందందే కలవాడు, సర్వోపగతుండు... అయిన ఆ మూలవిరాట్టుకు అడ్రస్సా... ఎక్కడుంటుంది. తిరుపతి వెంకన్న అంటే తిరుమలలోనూ, బిర్లా టెంపుల్‌లోనూ ఉన్నట్లు, శివుడు అంటే కాళహస్తిలో, చిదంబరంలో, శ్రీశైలంలో ఉన్నట్లు చెప్పడానికి వీల్లేదు కదా...

తిరుమలలు, కాళహస్తిలు, శ్రీశైలాలు, చిదంబరాలు... దేవుడి మజిలీలే కాని ఆయన శాశ్వత చిరునామాలు కాదు కదా.. కాబట్టి చివరకు తాము అమితంగా భయపడే జర్నలిస్టులకు, లాయర్లకు, పోలీసులకు అయినా కార్డులివ్వడానికి బ్యాంకులు సిద్ధమవుతాయి కాని అడ్రస్ ప్రూఫ్ లేని దేవుడికి ఏ బ్యాంకు అయినా కార్డు ఇచ్చే ధైర్యం చేయదు.. చేయలేదు కూడా....

బ్యాంకులు ఎవరికైనా క్రెడిట్ కార్డులు ఇచ్చేటపుడు చిరునామా ధ్రువీకరణ కోసం ఎంత తిప్పలు పెడతాయో, పడిన వారికే తెలుస్తుంది ఆ బాధ. కార్డు కావాలనుకునేవారు అడ్రస్ ప్రూఫ్ కోసం పడే తిప్పలు, బాధలు వాటి అనుభవాల నేపథ్యంలో చూసినప్పుడు... వేణు మెరుపు వేగంతో పేల్చిన ఈ అడ్రస్ ప్రూఫ్ జోకు ఎంతగా పేలిందంటే.... అడ్రస్ లేని, అడ్రస్ ప్రూఫ్ లేని దేవుడి పరిస్థితి గురించి ఆరోజంతా తలుచుకుంటూనే ఉండిపోయాం...

దైవభక్తులు, దేవుడిపై విశ్వాసం కలవారు యాదృచ్చికంగా పుట్టిన ఈ అడ్రస్ ప్రూఫ్ జోకు గురించి బాధపడకూడదని ఆశిస్తూ...

స్పందనలు

Re: దేవుడికి క్రెడిట్ కార్డు ఎందుకు ఉండదు?
chaalaa bagumdi jOk శేఖర్ గారూ 1 మనపొర్టల్ నుండి photo ,videolu elaa down load chesukOvaalO cheppagalaru.
నిరాకరణ