Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

మనం కాదు గుడ్డవేసుకోవాల్సింది...

యధావిధిగా పోర్టల్ పనిలో, లోకలైజేషన్ పనిలో మునిగి ఉన్నాం. ఆఫీసులో కూర్చుని కదలకుండా పనిచేస్తూంటే మా సీనియర్ సహోద్యోగి ఉన్నట్లుండి వెనక్కు చూశారు. ఎదురు సీట్‌లో ఓ మహిళా ఉద్యోగి ఆర్టికల్ రైటింగ్‌లో మునిగిపోయి ఉండటం చూశారు. ఏదో అసాధారణమైన దృశ్యం కనిపెట్టారు.

'మేడమ్.. చాలా తప్పు చేస్తున్నారు'

'ఏంటి సార్..'

'ఆహ. ఏం లేదు మీరు చాలా తప్పు చేస్తున్నారని అంటున్నా అంతే..'

'ఆ... ఏం తప్పు సార్,'

'మనం కాదు గుడ్డ వేసుకోవాల్సింది...'

అంటూ ఆయన ఆపేశారు..

ఆమెకు ఒక్కక్షణం అర్థం కాలేదు. ఎగాదిగా చూస్తే ఆమె తలపై చున్నీ కప్పుకుని మరీ టైప్ చేస్తోందన్నమాట.

అప్పుడన్నారు మళ్లీ..

'అదేనండీ మరి.. మనం కాదు గుడ్డ వేసుకోవాల్సింది..' అంటూ నవ్వేశారు.

అప్పుడు వెలిగింది మాకు ఆయన శ్లేషకు అర్థం..

నెత్తిమీద గుడ్డ వేసుకునేది ఎవరో మనకు తెలుసుగా.. ఎవరి నెత్తినో మనం గుడ్డవేయాలి కాని మనకు మనమే గుడ్డ వేసుకుంటే ఎలా అనేది ఆయన మాటల భావం.

నెత్తిన గుడ్డవేయడం అనే అచ్చతెలుగు నుడికారాన్ని ఆయన ఆ సందర్భానికి అచ్చుగుద్దినట్లు ఉపయోగించుకున్నారు.

విషయానికి వస్తే..

మా ఆఫీసులో ఎసి అన్నా, ఫ్యాన్ గాలి అన్నా పడని వారు ముఖ్యంగా ఉద్యోగినులు ఉన్నారు. ఎసి, ఫ్యాన్ ఆన్ చేయవద్దని వాళ్లు, ఉడుకు పెడుతోంది వేసుకుంటాం అని ఉద్యోగులు తరచుగా ఘర్షణ పడుతుంటాం. మహిళలు ఎసికి ఫ్యాన్ గాలికి ఎందుకు అలవాటు పడరు అనేది మరో సబ్జెక్ట్. దీంతో వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని అప్పుడప్పుడూ ఎసిని, ఫ్యాన్‌ను నిలిపివేస్తుంటాము.

క్లోజ్ డోర్స్‌లో గాలి లేకుంటే ఊపిరి ఆడనట్లుంటుంది మాకు. అందుకే ఈరోజు మధ్యాహ్నం కాస్సేపు ఫ్యాన్ ఆన్ చేస్తే ఆ మాత్రం గాలికే ఆమె తట్టుకోలేక యధావిధిగా తన నెత్తి మీద, భుజాలకు చున్నీ అడ్డుపెట్టుకుని పనిచేయసాగింది. సరిగా అప్పుడే ఆ దృశ్యం ఆయన కంటపడింది.

అలా పుట్టింది ఈ కథనం...

మనం కాదు గుడ్డవేసుకోవాల్సింది...

స్పందనలు

Re: మనం కాదు గుడ్డవేసుకోవాల్సింది...
గుడ్డ వేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్యే... నిజం కదూ...
నిరాకరణ