Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

మగపిల్లలం కదా త్వరగా ఇంటికి పోవాలి మరి!


ఇది కూడా మా సహోద్యోగి చెణుకే అనడంలో సందేహమే లేదు....

ఆఫీసులో పని ముగించుకున్న తర్వాత రాత్రి 7 గంటలపైన ఫణి బయలు దేరుతూ తనకే సాధ్యమైన ఈ జోకును పేల్చాడు. పోర్టల్ పని పూర్తయ్యాక... అందరితో సరదాగా హస్కు కొట్టి మరీ బయలు దేరే వాడు ఆ రోజు కూడా లేటు అయిందనే కారణంతో కాబోలు ఇంటికి బయలుదేరుతూ ఈ చెణుకు విసిరాడు. తను ఉదయం 8 గంటలకే తెలుగు పోర్టల్ పని మొదలెడతాడు కాబట్టి త్వరగా వెళతాడు.

ఆరోజు అలాగే బయలుదేరుతూ వస్తాను సార్, వస్తాను మేడమ్ అంటూ అందరినీ పేరు పేరునా పలకరించాడు. ఏం ఫణీ అప్పుడే వెళుతున్నావు అని మేమూ ఆటపట్టించాము. "మరి తప్పదు కద సార్. అసలే రోజులు బాగాలేవు, దానికి తోడు మగపిల్లలం కదా కాస్త త్వరగా ఇంటికి పోవాలి మరి" అంటూ రివర్స్ జోక్ వేశాడు. మగపిల్లలం కదా సేఫ్టీ క్వశ్చన్ అంటూ ఫణి తనదైన విరుపుతో జోకేసరికి మేమంతా పగలబడి నవ్వాము. మహిళలకు భద్రత లేని సామాజిక స్థితిని ఇలా మగవారికి వర్తింపచేసి ఫణి జోక్‌ ప్రయోగిస్తే దానిలో సరదా పాలెక్కి అందరం నవ్వేశాము.

అంతా బాగుంది.. కాని కొద్దిరోజులకే ఫణి జోక్‌కు భిన్నమైన సంఘటన ఒకటి నిజజీవితంలో జరిగింది. పుణే నగరంలో
ఐబిఎమ్ సంస్థలో పనిచేస్తున్న ఒక యువతిపై క్యాబ్ డ్రైవర్లు పది మంది అత్యాచారం చేశారు. క్రూరంగా.. ఘోరంగా... అర్థరాత్రి పూట ఆఫీసులో అర్జెంటుగా చేయవలసిన పని ఉందని ఐబిఎమ్ సంస్థ అధికారులు క్యాబ్ పంపితే నడి నిద్రలో తూలుకుంటూ నడిరేయి క్యాబ్‌లో బయలుదేరిన ఆ అమ్మాయిని క్యాబ్ డ్రైవర్లు వెంబడించి మరీ కూడబలుక్కుని దారుణానికి పాల్పడ్డారు.

ఇంతకు మించిన దారుణం ఏమంటే ఆరోజు ఆ అమ్మాయికి తాము అంత రాత్రి పూట ఆఫీసుకు రమ్మని కాల్ చేయలేదని సంస్థ అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ అమ్మాయి ఆసుపత్రిలో ఊపిరి ఉండీ లేని స్థితిలో కొట్టుమిట్టులాడుతోంది.

ఒక చెణుకుకు, ఒక వాస్తవానికి మధ్య అంతరం ఇంత నగ్నంగా బయటపడటం.. అది కూడా ఫణి ఆ జోక్ పేల్చిన కొద్ది రోజులకే ఆ జోక్‌కు భిన్నమైన సామాజిక వాస్తవం ఇంత అమానుష రీతిలో బయటపడటం... కేవలం యాదృచ్ఛికమే కావచ్చు. కాని ఇప్పుడనిపిస్తుంది. కొన్ని జోకులు నవ్వడానికి, నవ్వుకోడానికి ఆ క్షణంలో బాగుంటాయి కానీ వాటి సారాంశానికి భిన్నమైన వాస్తవం సమాజ జీవితంలో నెలకొనడం చూసినప్పుడు... కొన్ని జోకులకు మనం నవ్వకూడదేమో అనిపిస్తుంది..

కాదంటారా....

స్పందనలు

Re: మగపిల్లలం కదా త్వరగా ఇంటికి పోవాలి మరి!
వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని నవ్వటం మానేస్తే ప్రపంచంలో జోకులే మాయమైపోతాయి. అమ్మాయిల గురించి ఆ జోకేస్తే ఇంకెంత దారుణంగా ఉండేదో ఆలోచించండి. కాబట్టి, ఎక్కడో ఏదో జరిగిందని నవ్వటం మర్చిపోవద్దు. ఐబిఎం ఉద్యోగినికి జరిగినదానికి బాధపడండి, మీ సహోద్యోగి జోకుకి నవ్వండి. దేని దారి దానిదే.
Re: మగపిల్లలం కదా త్వరగా ఇంటికి పోవాలి మరి!
మారుతున్న ప్రపంచానికి మారుతున్న సవాళ్ళు. ఒళ్ళు జలదరించే అకృత్యాలు. --ప్రసాద్ http://blog.charasala.com
నిరాకరణ