నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర సామాన్య పౌరుడిగా జీవితం ప్రారంభించారు. తరతరాలుగా నేపాల్ రాజవంశీకులు గడిపిన నారాయణహితి రాజప్రాసాదాన్ని, వందలాది భృత్యులను, సేవకులను శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్లిన జ్ఞానేంద్ర సగటు మనిషిలా గురువారం నుంచి జీవితం మొదలెట్టారు. నేపాల్ రాజధాని ఖాట్మండు శివార్లలోని నాగార్జున ప్యాలెస్‌కు బుధవారం సతీమణితో కలిసి మాజీరాజు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
పేరుకు ప్యాలెస్ అని పిలువబడుతున్నప్పటికీ నాగార్జున మందిరం ఒకప్పుడు నేపాల్ రాజులు వేటాడే అటవీప్రాంతంలో విడిది స్థలంగా ఉండేది. రాజభవంతిని వదలి నాగార్జున ప్యాలెస్‌కు మాజీ రాజు వెళుతున్నప్పుడు వందలాది ప్రజలు ఖాట్మండూ నడిబొడ్డులో ఉండే రాజప్రాసాదం వద్ద గుమిగూడి రాజరికం అంతానికి మద్దతుగా హర్షధ్వానాలు చేశారు. కాగా రాజరికం మద్దతుదారులైన కొంతమంది రాజు నిష్క్రమణను చూసి తట్టుకోలేక ఏడ్చేశారని వార్తలు.
దాదాపు 240 ఏళ్ల చరిత్ర కలిగిన నేపాల్ రాజరికాన్ని గత నెలలో మావోయిస్టుల ఆధిపత్యంలో ఉన్న రాజ్యాంగసభ రద్దు చేసిన తర్వాత తొలిసారిగా స్పందించిన జ్ఞానేంద్ర, నేపాల్‌ను రిపబ్లిక్‌గా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని ప్రకటించారు. రాజప్రాసాదంలో పులి చర్మాలు, రైనోసార్ తలలతో అలంకరించిన మందిరంలో వెయ్యిమంది విలేఖరుల సమక్షంలో క్లుప్తంగా ప్రసంగించిన జ్ఞానేంద్ర ప్రజాతీర్పును తాను గౌరవిస్తున్నానని చెప్పారు.
అయితే తాను దేశాన్ని వదలిపెట్టడం లేదని, ప్రవాస జీవితం ఎంచుకోవడం లేదని మాజీ రాజు స్పష్టం చేశారు. మాజీ రాజు ప్రసంగాన్ని ఆద్యంతమూ వీక్షించిన ప్రముఖ నేపాలీ పత్రిక కాంతిపూర్ ప్రపంచపు చిట్టచివరి హిందూ రాజరికానికి ఇది గౌరవప్రదమైన ముగింపు అని అభివర్ణించింది.
ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా గౌరవప్రదంగా, శాంతియుతంగా మాజీ రాజు తన ప్రాసాదంలోంచి నిష్క్రమించారని, నేపాల్ ప్రజలు భవిష్యత్తులో తనపట్ల సానుభూతి చూపేరీతిలో ఆయన సందేశం సాగిందని కాంతిపూర్ పత్రిక ఎడిటర్ నారాయణ్ వాగ్లే వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగంలో జ్ఞానేంద్ర 2001లో రాజప్రాసాదంలో జరిగిన హత్యాకాండలో తనప్రమేయం ఉందని వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు.
తన మేనల్లుడు. ఆనాటి నేపాల్ యువరాజు అయిన దీపేంద్ర, 2001 జూన్ నెలలో ఎకె-47తో కాల్పులు జరిపి రాజు, రాణితో సహా తన కుటుంబాన్ని మొత్తంగా చంపి, ఆపై తానూ కాల్చుకుని చనిపోయిన తర్వాతే జ్ఞానేంద్రకు అనుకోని వరంలా నేపాల్ సింహాసనాన్ని అధిష్టించే అరుదైన అవకాశం దక్కింది. తాను ప్రేమించిన యువతిని వివాహమాడేందుకు కుటుంబం అడ్డుకోవడంతో కుపితుడైన యువరాజు దీపేంద్ర ఆనాటి రాజు బీరేంద్ర దంపతులతో పాటు కుటుంబ సభ్యులను హతమార్చాడు.
రాజ ప్రసాదాన్ని ఖాళీ చేస్తున్న సందర్భంగా ఆనాటి హత్యోదంతాన్ని ప్రస్తావించిన జ్ఞానేంద్ర పదే పదే నాటి ఘటనతో తనకు తన కుటుంబానికి ప్రమేయం ఉందని ఆరోపణలు గుప్పించారని, ఇప్పటికీ అవి తమను బాధిస్తున్నాయని ఉద్వేగంగా చెప్పారు. తన కుటుంబంపై ఇలా ఆరోపణలు గురిపెట్టడం అమానుషమని మాజీ రాజు వాపోయారు. ఆనాడు జిరిగిన హత్యోదంతంలో తన పాత్రమై ఇప్పటికీ అనుమానం ఉంటే ప్రభుత్పం ఈ ఘటనపై తిరిగి విచారణ మొదలెట్టి నిజానిజాలు తేల్చవచ్చని మాజీ రాజు సవాలు విసిరారని నేపాల్ వీక్లీ పత్రిక సంపాదకుడు యువరాజ్ ఘిమిరే తెలిపారు.
అయితే తదనంతరం జరిగిన అధికారిక విచారణలో ఈ హత్యలతో జ్ఞానేంద్ర కుటుంబం ప్రమేయం లేదని తేలినప్పటికీ, నేపాల్‌లోని మెజారిటీ ప్రజలు రాజప్రాసాదంలో జరిగిన కుట్రకు జ్ఞానేంద్రే కారకుడని విశ్వసిస్తూండటం గమనార్హం.
నేపాల్ సింహాసనంపై జ్ఞానేంద్ర అధిష్టించడం, రాజప్రాసాదాన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఖాళీ చేయవలసి రావడం వెనుక హింసాత్మక నేపథ్యం ఉండటం గమనార్హం. నాటి నేపాల్ రాజు బీరేంద్ర దారుణ హత్య తర్వాత సింహాసనాన్ని అధిరోహించిన జ్ఞానేంద్ర మరోవైపు మావోయిస్టు తిరుగుబాటు కారణంగా 13 వేలమంది ప్రజలు హతులైన తర్వాత 2006లో ప్రభుత్వానికి, తిరుగుబాటుదారుల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అంతిమ ఫలితంలో భాగంగా హింసాత్మక నేపథ్యంలోనే రాజప్రాసాదాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడం గమనార్హం.
రాజరికం నుంచి సామాన్య పౌరుడి వరకూ జ్ఞానేంద్ర ప్రస్థానం హింసతో మొదలై హింసాత్మక నేపధ్యంలోనే ముగియడం చరిత్రలో మిగిలిపోయే సందర్భమే మరి.

లోడ్ అవుతోంది...